Homeఆంధ్ర ప్రదేశ్పీఠాపురంపై ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ప్ర‌త్యేక ఫోక‌స్‌...!మాట‌ల్లో కాదు చేత‌ల్లో చూపిస్తున్న వైనం...

పీఠాపురంపై ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ప్ర‌త్యేక ఫోక‌స్‌…!మాట‌ల్లో కాదు చేత‌ల్లో చూపిస్తున్న వైనం…

  • రూ.1,500 కోట్ల పనులకు శ్రీకారం.. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

  • 97 వేల మందికి తాగునీరు.. రూ.9.59 కోట్లతో నాగులపల్లి పథకం ఆధునీకరణ

  • డ్రైనేజీ, తీర రక్షణ, ఆలయాలు, మహిళలు, మత్స్యకారులకు ప్రాధాన్యం

  • పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చే లక్ష్యంతో వరుస ప్రాజెక్టులు

 

 

కాకినాడ , క్రైమ్‌మిర్ర‌ర్‌:పిఠాపురం అంటే పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలోనూ అదే పేరు వినిపించేలా కార్యాచరణ మొదలైంది. పిఠాపురం వేదికగా పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన మార్క్‌ చూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు డిప్యూటీ సీఎం. ఒకేసారి పలు రంగాలను టచ్‌ చేసేలా పిఠాపురం అభివృద్ధి ప్రణాళిక ముందుకు కదులుతోంది. తాగునీటి సమస్య నుంచి భూగర్భ డ్రైనేజీ వరకు.. తీర ప్రాంత రక్షణ నుంచి ఆలయాల అభివృద్ధి వరకు.. మహిళల ఆర్థిక స్వావలంబన నుంచి మత్స్యకారుల భద్రత వరకు విస్తరించే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ రెండు రోజుల పర్యటనలో సుమారు రూ.1,500 కోట్ల విలువైన వివిధ పనులను ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వివిధ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

ముందుగా తాగునీటికి ప్రాధాన్యం…

పర్యటనలో ముఖ్యమైన అంశాల్లో నాగులపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకం ఒకటి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా చివరి ప్రాంతాలకు తగినంత నీరు చేరకపోవడంతో రూ.9.59 కోట్లతో ఆధునీకరణ చేపట్టారు. ఇప్పుడు ఈ పథకం ద్వారా ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం గ్రామీణ మండలాల పరిధిలోని 52 ఆవాసాలకు చెందిన దాదాపు 97 వేల మందికి రక్షిత తాగునీరు అందేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొండేవారం ప్రాంతంలో ఇంటింటికీ అందుతున్న నీటి సరఫరాను కూడా ఆయన పరిశీలించారు. ప్రజలకు వాస్తవంగా నీరు చేరుతున్న తీరును తెలుసుకునేందుకు కుళాయి కనెక్షన్లను స్వయంగా పరిశీలించారు.

ఆలయాల నుంచి పచ్చదనం వరకు..

పర్యటనలో ఆధ్యాత్మిక, పర్యావరణ అంశాలకు కూడా చోటు దక్కింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని పవన్‌ కల్యాణ్‌ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ.90 లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించారు. రథశాల, యాగశాల, కాలక్షేప మండపం, అన్నదాన హాలు వంటి నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. పిఠాపురం పట్టణంలో పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో ‘పీఠికాపుర వనం’ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు ఎఫ్‌.కె.పాలెం మైసమ్మ చెరువు అభివృద్ధి, చందుర్తి–తాటిపర్తి బీటీ రహదారి వంటి పనులను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

పట్టణ సమస్యలకు శాశ్వత పరిష్కారం…?

పిఠాపురం పట్టణ మౌలిక వసతుల్లో కీలకంగా భావిస్తున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. పిఠాపురంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ప్రాజెక్టుకు రూ.200 కోట్ల స్థాయిలో ప్రతిపాదనలు ఉన్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. అలాగే రహదారులు, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి, మున్సిపల్‌ తాగునీటి సదుపాయాలకు సంబంధించిన పనులు కూడా ప్రణాళికలో ఉన్నాయి. పట్టణంలోని చెత్త నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపేందుకు డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరించాల్సిన అవసరంపైనా దృష్టి సారిస్తున్నారు. మౌలిక వసతులు మెరుగుపడితే పట్టణ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఉప్పాడ తీరానికి రక్షణ కవచం…

పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత సమస్యకు కూడా ప్రాధాన్యం దక్కింది. ఉప్పాడ తీరాన్ని సముద్ర కోత నుంచి కాపాడేందుకు రూ.323 కోట్లతో తీర రక్షణ గోడ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు తీరప్రాంత ప్రజలు, మత్స్యకారుల జీవన భద్రతకు సంబంధించిన కీలక అంశంగా నిలుస్తోంది. మత్స్యకారుల కోసం ఆధునిక లైఫ్‌ జాకెట్లను అందించడంతో పాటు డ్రైఫిష్‌ యూనిట్లు, ఐస్‌ బాక్సులతో కూడిన వాహనాలను అందించే కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. సముద్ర వేట సమయంలో భద్రతతో పాటు చేపల ఉత్పత్తుల నిర్వహణలోనూ ఇవి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారు.

మహిళా సంఘాలకు రూ.120 కోట్ల రుణాలు…

అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ కార్యక్రమాలపైనా పర్యటనలో దృష్టి పెట్టారు. స్వయం సహాయక సంఘాలకు సుమారు రూ.120 కోట్ల రుణాలను అందించే కార్యక్రమం చేపట్టారు. సెర్ప్‌, మెప్మా సహకారంతో మహిళలకు ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పాటు అందించేలా ఈ రుణాలు పంపిణీ చేశారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు లేదా క్రమబద్ధీకరణకు సంబంధించిన పట్టాల పంపిణీ కూడా చేపట్టారు. విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా పదో తరగతిలో ప్రతిభ చూపిన వారికి ల్యాప్‌టాప్‌లు అందించారు.

రైతుల నుంచి ప్రత్యేక కానుక…

పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా రైతులు ప్రత్యేకంగా స్పందించారు. తమ వ్యవసాయ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా నాగలిని ఆయనకు అందజేశారు. రైతుల తరఫున కృతజ్ఞతగా ఈ కానుకను అందించినట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే పిఠాపురం పర్యటనలో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, తీర రక్షణ, పర్యావరణం, ఆలయాలు, మహిళా సంఘాలు, మత్స్యకారుల సంక్షేమం వంటి విభిన్న రంగాలకు సంబంధించిన అంశాలు ఒకే వేదికపైకి వచ్చాయి. సుమారు రూ.1,500 కోట్ల పరిధిలోని పనులతో నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశ ఇవ్వాలన్న ప్రయత్నం కనిపించింది. పిఠాపురాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. మరోవైపు పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన వినతులను కూడా స్వీకరించారు.మొత్తంగా.. రెండో రోజు పిఠాపురం పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ పలు కీలక అభివృద్ధి పనులకు కదలిక తీసుకొచ్చారు తీర ప్రాంత రక్షణ నుంచి ఆలయాల అభివృద్ధి వరకు దృష్టి సారించారు. రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమాలు పూర్తయితే పిఠాపురంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలంగాణలో దసరాకు కొత్త పింఛన్లు…! సీఎం ఆదేశం…
  2. ఆజంగఢ్‌లో ముగ్గురి దారుణ హత్య.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడితో పాటు కుమారుడు మృతి
  3. భారీ డీజే శబ్దం.. రెండో తరగతి బాలిక మృతి
  4.  క్యాన్సర్ మందుల పేరిట భారీ దోపిడీ.. సుప్రీం కోర్టు సీరియస్!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు