క్రైమ్ మిర్రర్: పాకిస్తాన్‌లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని ఓల్డ్ పోలీస్ లైన్స్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రార్థనల సమయంలో పేలుడు జరగడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలతో నింపిన ఓ కారును పోలీస్ లైన్స్ గేటు సమీపంలోకి తీసుకొచ్చి పేల్చినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు ధాటికి అక్కడి పరిసర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు పోలీసులు ఉన్నారు. మరో 25 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.
పోలీస్ లైన్స్‌కు సమీపంలోని మసీదు కూడా పేలుడు ప్రభావానికి గురైంది. మసీదు గోడలు కూలిపోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలు సైతం దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని కోహట్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పేలుడు నేపథ్యంలో ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, అదనపు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
మరోవైపు, పేలుడు జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరికొందరు దుండగులు దాక్కుని ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రహదారులను మూసివేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది ఎవరు? పేలుడు వెనుక కారణం ఏమిటి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : తెలంగాణ సర్కార్ దూకుడు…! కేసీఆర్‌కు నోటీసులు రెడీ…
