సోషల్ మీడియా వినియోగంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) మరింత కఠినమైన నిబంధనల దిశగా అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. అదే సమయంలో టీనేజర్లకు వయసును బట్టి సోషల్ మీడియా ఫీచర్లను పరిమితం చేసే విధానాన్ని తీసుకురావాలని ఈయూ భావిస్తోంది.
ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ వెల్లడించిన ప్రతిపాదనల ప్రకారం.. 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారికి పూర్తి స్థాయి సోషల్ మీడియా ఖాతాలకు బదులుగా పరిమిత ఫీచర్లతో కూడిన ప్రత్యేక మినీ ఖాతాలను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఖాతాల వినియోగం సంరక్షకులు లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు.
ఇక 15 నుంచి 18 ఏళ్ల వయసున్న టీనేజర్ల కోసం సోషల్ మీడియా సంస్థలు ప్రత్యేక భద్రతా ప్రమాణాలతో కూడిన డిజైన్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. యువత సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడంతో పాటు, వయసుకు తగిన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడమే ఈ చర్యల ఉద్దేశంగా తెలుస్తోంది.
27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్‌లో ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియా వినియోగంపై వయస్సు ఆధారిత నియంత్రణలు మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది. అయితే తుది నిబంధనలు, వాటి అమలు విధానంపై ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
also read: శ్రీదేవి ఆస్తి వివాదం.. బోనీ కపూర్ కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు
