Homeక్రైమ్పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్

పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : పాకిస్థాన్‌కు అనుకూలంగా గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ దంపతులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మొహమ్మద్ సాహిల్, అతని భార్య సమీరగా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బదాయున్‌కు చెందిన సాహిల్, బిజ్నూర్‌కు చెందిన సమీర కొంతకాలంగా పాకిస్థాన్‌కు చెందిన నిఘా వ్యవస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. భారత నిఘా సంస్థల నుంచి అందిన సమాచారంతో స్పెషల్ సెల్‌కు చెందిన నార్తర్న్ రేంజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ దంపతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సాహిల్ 2024 నుంచి పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాక్‌కు చెందిన వ్యక్తులను సంప్రదించేవాడని గుర్తించారు. అనంతరం అతని భార్య కూడా ఈ కార్యకలాపాల్లో భాగస్వామిగా మారినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్థిక ప్రయోజనాల కోసం..

పాకిస్థాన్‌కు చెందిన ఏజెంట్లు ఆర్థికంగా సహకరిస్తామని హామీ ఇవ్వడంతో దంపతులు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాక్ అనుకూల వ్యక్తులను తమ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడం, వారికి అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించడం వంటి బాధ్యతలను వీరికి అప్పగించినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.

ఎనిమిది సిమ్ కార్డులు పాక్‌కు..

ఈ దంపతులు భారత్‌లో ఎనిమిది సిమ్ కార్డులను కొనుగోలు చేసి, వాటిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో సిమ్ కార్డుకు సంబంధించిన లావాదేవీల ద్వారా మొత్తం రూ.30 వేల వరకు అందుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. భారత నంబర్లతో ఉన్న ఈ సిమ్ కార్డులను పాకిస్థాన్ నుంచి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. వాటికి వాట్సాప్ ఖాతాలను కూడా యాక్టివేట్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ నంబర్లను ఉపయోగించి భారతీయ వాట్సాప్ గ్రూపుల్లోకి ప్రవేశించి నిఘా సంబంధిత కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

కంటోన్మెంట్ ప్రాంతాల్లో పర్యటన

నిందితులు దేశంలోని కొన్ని కంటోన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? నిందితులకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఎలాంటి సమాచారాన్ని సేకరించి పంపించారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లలోని డిజిటల్ సమాచారం, వాట్సాప్ సంభాషణలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.
also read : కంగనాతో వివాదానికి ఫుల్‌స్టాప్.. రాఖీ సందర్భంగా రామ్‌దేవ్ కీలక నిర్ణయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు