ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కూతురు కొవ్వూరి సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల మరణ వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో కుటుంబ పరిస్థితులు, తన కుమారుడు రియోతో ఉన్న అనుబంధం, అలాగే సాధిక్ అనే వ్యక్తితో పరిచయం గురించి ఆమె వివరించినట్లు తెలుస్తోంది.
చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నానని, తన తండ్రికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా జాగ్రత్తగా ఉండేదానినని సౌజన్య పేర్కొన్నట్లు సమాచారం. 2018లో తన తమ్ముడిని కోల్పోయిన అనంతరం వివాహం చేసుకున్నానని, ఆ తర్వాత తనకు కుమారుడు జన్మించాడని ఆమె వాంగ్మూలంలో వివరించినట్లు తెలుస్తోంది.
తన భర్త తనను ఎక్కువగా బయటకు తీసుకెళ్లేవారు కాదని, దీంతో కుమారుడు రియోలో ఒంటరితనం పెరిగిందని సౌజన్య పేర్కొన్నట్లు సమాచారం. ఈ కారణంగా కాకినాడలో గత రెండేళ్లుగా తన కుమారుడిని తరచూ బయటకు తీసుకెళ్లి, వివిధ విషయాలను పరిచయం చేస్తూ సమయం గడిపినట్లు ఆమె తెలిపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సాధిక్ అనే వ్యక్తి రియోకు పరిచయమయ్యాడని సౌజన్య వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ పరిచయం ద్వారా తమ కుటుంబానికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు, తన భర్త ఎక్కువ సమయం ఇంట్లో ఉండరనే విషయం కూడా సాధిక్‌కు తెలిసిందని ఆమె వివరించినట్లు తెలుస్తోంది.
తొలుత తనను సరదాగా మాట్లాడిస్తూ, ఎంటర్టైన్ చేస్తూ పరిచయం కొనసాగించాడని.. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలను అడ్డుపెట్టుకుని తనను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని సౌజన్య పేర్కొన్నట్లు సమాచారం.
ఈ మరణ వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే వాంగ్మూలంలో ఉన్న ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి, ఘటనకు దారితీసిన పరిస్థితులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
also read: కాంగ్రెస్ సర్కార్ అవినీతిపై బీజేపీ సమరం…! రాంచందర్‌రావు రెండు రోజుల దీక్ష…
