క్రైమ్ మిర్రర్ : యానాంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను భర్తే హత్య చేసి, మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అనంతరం భార్య కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసులో మరింత సంచలనంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు ఆరేళ్ల క్రితం చెక్క అప్పారావు, రేఖ (26) ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహం జరిగిన కొంతకాలానికే భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఇరు కుటుంబాల పెద్దలు పలుమార్లు జోక్యం చేసుకుని వారిని రాజీ కుదిర్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో మరోసారి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన అప్పారావు భార్య రేఖపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం యానాం గణపతి నగర్ సమీపంలోని గోదావరి నదిలో ఆమె మృతదేహాన్ని పడేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఘటనను దాచిపెట్టేందుకు అప్పారావు మరో కథ అల్లినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి రేఖ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అప్పారావు చివరకు నిజాన్ని అంగీకరించినట్లు సమాచారం. భార్యను తానే హత్య చేసి గోదావరిలో పడేసినట్లు పోలీసుల ఎదుట వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గోదావరి నదిలో రేఖ మృతదేహం కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. భర్త చేతిలోనే వివాహిత హత్యకు గురైన ఘటన యానాంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
also read : తెలుగు రాష్ట్రాల్లో ఈడి సోదాలు…!
