క్రైమ్ మిర్రర్ : ముంబైలోని పోవాయి ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిష్టి తీసివేస్తానంటూ ఓ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి.. అక్కడి మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆగస్టు 18న జరిగినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. 28 ఏళ్ల అనిల్ శేష్రావ్ షిండే అనే వ్యక్తి ట్రాన్స్‌జెండర్ వేషధారణలో బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు. ఇంట్లో చెడు దృష్టి ఉందని, దానిని తొలగిస్తానని చెప్పి మహిళను నమ్మించినట్లు పోలీసులు వెల్లడించారు.
బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దాడి
మహిళను నమ్మించిన నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమెపై భౌతికంగా దాడి చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోవాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడి కదలికలను గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
వేషం మార్చుకుని తప్పించుకునే ప్రయత్నం
దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. చీర ధరించి ఆటోరిక్షాలో ప్రయాణించిన అతడు థానేలోని ఖారేగావ్ మురికివాడ ప్రాంతానికి చేరుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు కేవలం ట్రాన్స్‌జెండర్‌గా మాత్రమే కాకుండా, కొన్ని సందర్భాల్లో బిచ్చగాడి వేషంలోనూ తిరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అతడి కదలికలను సీసీటీవీ ఆధారాలతో ట్రాక్ చేసిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు.
ప్రజలకు పోలీసుల హెచ్చరిక
ఈ ఘటన నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. దిష్టి తీస్తామని, పూజలు చేస్తామని, ఇతర కారణాలతో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే గుర్తుతెలియని వ్యక్తులను అనుమతించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కేసులో నిందితుడి వేషధారణ, అతడి కదలికలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : షావుకారు జానకి ఇక లేరు.. తెలుగు తెరకు తీరని లోటు
