మహిళా ఉద్యోగుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్న తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో కాన్పుకు కూడా 365 రోజుల ప్రసూతి సెలవు అందించనుంది. ఇప్పటివరకు ఈ ఏడాది సెలవు సదుపాయం తొలి రెండు కాన్పులకు మాత్రమే వర్తించేది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఇద్దరి కంటే తక్కువ మంది పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు అందుతోంది. అయితే మూడో కాన్పు విషయంలో మాత్రం 12 వారాల సెలవు మాత్రమే మంజూరు చేస్తున్నారు. తాజాగా ఈ నిబంధనలో మార్పులు తీసుకొచ్చి మూడో కాన్పుకు కూడా ఏడాది పాటు ప్రసూతి సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల నిర్వహణ శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆ శాఖ మంత్రి డి. శరత్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళా సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని.. అందులో భాగంగానే మూడో కాన్పుకు ప్రస్తుతం ఉన్న 12 వారాల సెలవును 365 రోజులకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.
తమిళనాడులో ప్రసూతి సెలవుల విషయంలో గతంలోనూ పలు మార్పులు జరిగాయి. 90 రోజులుగా ఉన్న సెలవును 2011లో ఆరు నెలలకు, 2016లో తొమ్మిది నెలలకు పెంచారు. ఆ తర్వాత 2021 జూలైలో ప్రసూతి సెలవును 365 రోజులకు పెంచారు. అయితే ఈ సదుపాయం తొలి రెండు కాన్పులకే పరిమితమైంది. మూడో కాన్పుకు మాత్రం 12 వారాల సెలవు నిబంధన కొనసాగింది.
తాజా నిర్ణయంతో మూడో కాన్పుకు ఉన్న ఈ పరిమితి తొలగిపోనుంది. కొత్త నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేయనున్నట్లు సంబంధిత అధికారి వెల్లడించారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తమిళనాడు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో మరింత సమయం కుటుంబంతో గడిపే అవకాశం లభించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళా ఉద్యోగుల సంక్షేమంలో మరో కీలక ముందడుగుగా నిలవనుంది.
also read: హత్యాయత్నం కేసులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి బెయిల్.. అయినా బయటకు రాకుండా జైలులోనే…
