క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్-2లో సాయిబాబా ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు ఐదో అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన సిలివేరు కుమార్ (35) కొంతకాలంగా ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి కుటుంబంతో కలిసి గాజులరామారంలో నివాసం ఉంటున్నాడు. నిర్మాణ రంగంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.రోజువారీ పనుల్లో భాగంగా బుధవారం పద్మనగర్ ఫేజ్-2లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ వద్ద క్రేన్ మిషన్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భవనం కింది నుంచి నిర్మాణ సామగ్రిని పైకి తరలించే పనిలో ఉండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది.
క్రేన్ మిషన్‌కు సంబంధించిన బేరింగ్‌లు అకస్మాత్తుగా ఊడిపోవడంతో మిషన్‌పై ఉన్న కుమార్ అదుపుతప్పి ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.కుమార్ మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య మమతతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న కుమార్ మృతి చెందడంతో భార్య, పిల్లలు తీవ్రంగా కలత చెందారు.
మరోవైపు నిర్మాణ ప్రదేశంలో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల రక్షణ కోసం అవసరమైన సేఫ్టీ పరికరాలు, ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటనను నివారించవచ్చని వారు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ సంస్థ, భవన యజమాని నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read : మహువా మొయిత్రాకు కోర్టు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
