రష్యా రాజధాని మాస్కోలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ రెస్టారెంట్ సమీపంలో జరిగిన భారీ పేలుడులో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో నగరంలో భద్రతా ఆందోళనలు నెలకొన్నాయి.
అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఓ అనుమానాస్పద మహిళ రెస్టారెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అదే సమయంలో రెస్టారెంట్ ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
పేలుడు తీవ్రతకు రెస్టారెంట్ ప్రవేశ భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన వెనుక ఉద్దేశం ఏమిటి అనే విషయంపై రష్యా భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ఇది ఆత్మాహుతి దాడా? లేక మరేదైనా కుట్రలో భాగమా? అనే కోణాల్లో అధికారులు ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. పేలుడు వెనుక ఉన్న కారణాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
also read: కుల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు మృతి
