క్రైమ్ మిర్రర్ : పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని మరో వ్యక్తి రాళ్లు, సిమెంట్ ఇటుకతో దాడి చేసి హత్య చేసిన ఘటన ఆదివారం కలకలం రేపింది. చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్-1పై ఈ ఘటన జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో ఉప్పుగూడ–యాకుత్‌పురా వైపు ఉన్న ప్లాట్‌ఫాంపై ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిందితుడు అక్కడే ఉన్న గ్రానైట్ రాళ్లు, సిమెంట్ ఇటుకతో బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో బాధితుడు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తీవ్ర మద్యం మత్తులో ఉండటంతో పూర్తి వివరాలు వెల్లడించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు, నిందితుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, గుర్తింపు కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై చత్రినాక పోలీసులు, జీఆర్పీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
also read : ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఐదుగురు దుర్మరణం
