HomeUncategorizedఇంటి నుంచి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన పులి.. మహిళ మృతి

ఇంటి నుంచి 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన పులి.. మహిళ మృతి

క్రైమ్ మిర్రర్ : పులి దాడిలో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై పులి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కన్హా నేషనల్ పార్క్ సమీపంలోని పారాపూర్ బాగాటొలా గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో సుగ్నీ బాయి దుర్వే అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుండగా పులి అక్కడికి వచ్చింది. పులి మహిళ తలను నోట కరుచుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకెళ్లింది. దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఆమెను లాక్కెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పులి ఆమెను వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది.

తీవ్ర గాయాలతో ఉన్న మహిళను వెంటనే బైహార్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సిజోరా బఫర్ జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆశిష్ పాండే తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో గతంలోనూ పులులు, చిరుతలు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. మృతురాలు తన కుటుంబంతో కలిసి ఓ గుడిసెలో నివసిస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇంటికి సరైన తలుపులు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని పేర్కొంటూ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. అటవీ శాఖ అధికారులు స్థానికులకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. రాత్రి వేళల్లో ఇళ్ల తలుపులు మూసుకోవాలని, చిన్నారులు, వృద్ధులను ఒంటరిగా బయట ఉంచవద్దని సూచించారు. పులుల సంచారాన్ని అరికట్టేందుకు గస్తీని పెంచుతున్నట్లు తెలిపారు.
also read : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి… సూసైడ్ నోట్ కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు