క్రైమ్ మిర్రర్ : మహారాష్ట్రలోని పూణె జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పింప్రి ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్న వినోద్ పిళ్లై (50), ఆయన భార్య సిర్జా (45), కుమార్తె పూర్ణిమ (19) ఈ ఘటనలో మృతి చెందారు. వినోద్ ఐఐఎం అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ చదివినట్లు, సిర్జా ఓ పాఠశాలలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శనివారం సిర్జా విధులకు హాజరు కాకపోవడంతో ఆమె సహోద్యోగులు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఇంటికి వెళ్లి చూడగా ముగ్గురూ అపస్మారక స్థితిలో కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో సూసైడ్ నోట్‌తో పాటు ఓ రసాయనం ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ముగ్గురినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా వినోద్ ఆన్‌లైన్‌లో సోడియం నైట్రేట్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రసాయనం నుంచి వెలువడిన ప్రభావంతోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అప్పుల సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్‌లో తమ నిర్ణయానికి ఎవరినీ బాధ్యులను చేయవద్దని పేర్కొన్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఆ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల క్రితం నెహ్రూ నగర్‌లోని ఇంటిని విక్రయించి, ఆ తర్వాత మోర్వాడి ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
also read : బ్రహ్మపుత్ర నదిలో ఐఐటీ విద్యార్థిని మృతి.. మరో విద్యార్థినికి తృటిలో ప్రాణాపాయం
