క్రైమ్ మిర్రర్ : ఐఐటీ గౌహతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తు బ్రహ్మపుత్ర నదిలో పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో విద్యార్థినిని సహాయక సిబ్బంది రక్షించారు. ఈ విషాద ఘటన అస్సాంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఐఐటీ గౌహతిలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నారు. శనివారం కొంత సమయం బయట గడిపేందుకు లతియా బగీచా ఘాట్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి ఇద్దరూ బ్రహ్మపుత్ర నదిలో పడిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక విద్యార్థినిని దాదాపు పది నిమిషాల్లోనే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో విద్యార్థిని కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. సుమారు మూడు గంటల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. మృతి చెందిన విద్యార్థిని ఐఐటీ గౌహతిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు విద్యాసంస్థ అధికారులు తెలిపారు. విద్యార్థిని మృతిపై ఐఐటీ గౌహతి యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన తమ సంస్థతో పాటు బాధిత కుటుంబానికి తీరని లోటని పేర్కొంది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : ఘోర విమాన ప్రమాదం.. టూరిస్ట్ విమానం కూలి 13 మంది మృతి
