Homeక్రైమ్పోలీసుల కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ పరార్.. అప్రమత్తమైన పోలీసులు, ముమ్మర గాలింపు

పోలీసుల కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ పరార్.. అప్రమత్తమైన పోలీసులు, ముమ్మర గాలింపు

క్రైం మిర్రర్ : వాహనాల దొంగతనం కేసులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమై నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జొన్నల సాయికుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన అతడు, తన ఆదాయం సరిపోకపోవడంతో రాత్రి వేళల్లో నిర్లక్ష్యంగా పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

సిద్దిపేట జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనాల చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అపే ఆటో, సిద్దిపేట వన్‌టౌన్ పరిధిలో పల్సర్ బైక్, హోండా యాక్టివా స్కూటీ, సిద్దిపేట టూటౌన్ పరిధిలో బజాజ్ సీఎన్‌జీ ఆటోను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి నివాసం వెనుక దాచిపెట్టిన చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని జ్యూడీషియల్ రిమాండ్‌లో భాగంగా సిద్దిపేట జిల్లా జైలుకు తరలించారు. ఈ నెల 15వ తేదీ నుంచి జైలులో ఉన్న సాయికుమార్‌ను శనివారం మరో ఆరుగురు ఖైదీలతో కలిసి సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం తిరిగి జైలుకు తరలించే సమయంలో ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం, తిరుగు ప్రయాణంలో నిందితుడు తనతో పాటు ఉన్న ఖైదీ సహాయంతో చేతులకు వేసిన హ్యాండ్‌కఫ్స్‌ను తొలగించుకుని, పోలీస్ వ్యాన్‌లోని ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వెళ్లి పరారైనట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పరారైన ఖైదీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : కడుపు నొప్పితో ఆస్పత్రికి.. పరీక్షల్లో గర్భం వెలుగులోకి, నిందితుడిపై పోక్సో కేసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు