ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతుగా ప్రసంగాలు చేశారనే ఆరోపణలతో అరెస్టైన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
దర్యాప్తు సందర్భంగా రావణ్ మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన పోలీసులు, అందులో తొలగించిన కొన్ని వీడియోలను గుర్తించినట్లు సమాచారం. వాటిలో పలువురు యువతులతో కలిసి చిత్రీకరించిన వ్యక్తిగత వీడియోలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హోటల్ గదుల్లో తీసిన కొన్ని వీడియోలను కూడా ఆయన ఫోన్‌లో భద్రపరిచినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. పోలీసులు విచారణకు వచ్చే ముందు ఆ వీడియోలను తొలగించే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా తొలగించిన ఫైళ్లలో చాలా వరకు తిరిగి గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలను అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే విద్వేషపూరిత వ్యాఖ్యలు, సామాజిక వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై కేసు నమోదైన నేపథ్యంలో, యువతులతో సంబంధమైన అంశాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కొందరు యువతులను బెదిరించి ఉండవచ్చనే అనుమానాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో లభించిన అన్ని డిజిటల్ ఆధారాలను సేకరించి వాటి ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించినట్లు చెబుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.