Radha Gayatri Death Mystery: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తమ కుమార్తె మృతికి ఆమె భర్త శ్రీచరణ్ కారణమని రాధాగాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాధాగాయత్రి మరణానికి సంబంధించిన పూర్తి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఆనంద్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ముఖ్యంగా జూన్ 14 నుంచి 16 మధ్య ముస్సోరీలో ఏం జరిగింది? రాధాగాయత్రి మరణానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ విచారణను ముస్సోరీ డివిజనల్ మేజిస్ట్రేట్ నిర్వహిస్తున్నారు. రాధాగాయత్రి మృతికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, ముస్సోరీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు, ఘటన సమయంలో ఆమెతో ఉన్న వ్యక్తులు, ఆస్పత్రి రికార్డులు, చికిత్స వివరాలు వంటి అంశాలపై కూడా సమాచారం సేకరిస్తున్నారు.
ఇక ఈ కేసులో మరో కీలక అంశంగా పోస్టుమార్టం వ్యవహారం మారింది. రాధాగాయత్రి తల్లిదండ్రులు అక్కడికి చేరుకునేలోపే పోస్టుమార్టం నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోస్టుమార్టం ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగిందా? లేదా? అనే అంశాన్ని కూడా విచారణలో పరిశీలించనున్నారు. అవసరమైతే పోస్టుమార్టంలో పాల్గొన్న వైద్య సిబ్బంది, సంబంధిత అధికారుల నుంచి కూడా వివరాలు తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకు సమాచారం ఎలా ఇచ్చారు? పోస్టుమార్టం నిర్వహణలో ఎలాంటి విధివిధానాలు పాటించారు? అనే అంశాలనూ అధికారులు పరిశీలించనున్నారు.
ప్రారంభం నుంచే ఈ కేసు పలు అనుమానాలకు తావివ్వడంతో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణ పూర్తయిన తర్వాత రాధాగాయత్రి మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, నిజానిజాలు బయటపడేలా సమగ్ర దర్యాప్తు జరపాలని రాధాగాయత్రి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.