Homeక్రైమ్Influencer Murder: సోషల్ మీడియా పంచాయితీ.. భార్యను దారుణంగా చంపిన భర్త!

Influencer Murder: సోషల్ మీడియా పంచాయితీ.. భార్యను దారుణంగా చంపిన భర్త!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ మహిళ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బ్యూటీషియన్‌గా గుర్తింపు పొందిన నిషా చౌహాన్‌ను ఆమె భర్త ప్రదీప్ చౌహాన్ కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన వారి 17 ఏళ్ల కుమారుడు కూడా గాయపడ్డాడు. అనంతరం నిందితుడు తనను తాను కత్తితో గాయపరుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

ప్రదీప్, నిషా దంపతులు తమ కుమారుడితో కలిసి మీరట్‌లో నివసిస్తున్నారు. నిషా బ్యూటీ పార్లర్ నిర్వహించడంతో పాటు సోషల్ మీడియాలో వీడియోలు చేసేది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా చురుకుగా ఉండటాన్ని ప్రదీప్ ఇష్టపడేవాడు కాదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. ఇటీవల ఓ స్థలం ఎవరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలనే అంశంపై కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కోపంతో ప్రదీప్ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని నిషాపై వరుసగా దాడి చేశాడు. తల్లి కేకలు విని కుమారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి కూడా కత్తిపోట్లు తగిలాయి. తీవ్ర గాయాల కారణంగా నిషా అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి కళ్ల ముందే చనిపోవడం కుమారుడిని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

భార్య మృతి చెందిన తర్వాత ప్రదీప్ కూడా తన ఛాతీలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. నిషా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ హత్యకు దారితీసిన అసలు కారణాలు ఏమిటి అనే విషయంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు