Wife Murder Case in Haryana: హర్యానాలో ఓ దారుణ హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పెళ్లైన మూడు నెలలకే భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తన ప్రియురాలితో కలిసి నేపాల్‌కు పారిపోయాడు. నెల రోజుల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
గురుగ్రామ్‌లోని మనేశ్వర్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల అంకిత్‌కు మూడేళ్ల క్రితం ఝజ్జర్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల రజనీ దేవితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే కుటుంబ సభ్యుల నిర్ణయంతో అంకిత్ గత ఫిబ్రవరిలో మధు అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత కూడా అంకిత్ తన ప్రియురాలు రజనీతో సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయం ఇద్దరి మధ్య సమస్యలకు దారితీసినట్లు తెలుస్తోంది. చివరకు భార్యను అడ్డుగా భావించిన అంకిత్, రజనీ కలిసి ఆమెను హత్య చేయాలని పథకం రచించారు.
ఈ ఏడాది మే 21న అంకిత్ తన భార్య మధును రజనీ ఉంటున్న గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి ఆమెపై కాల్పులు జరిపారు. మధు అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి ముందుగా హరిద్వార్‌కు వెళ్లి, ఆ తర్వాత నేపాల్‌కు పారిపోయారు.మధు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి మే 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా రజనీ నివాసానికి వెళ్లగా అక్కడ మధు మృతదేహం కనిపించింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు.
దాదాపు నెల రోజుల తర్వాత అంకిత్, రజనీ జూన్ 30న భారత్‌కు తిరిగి రాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ ఘటన హర్యానాలో తీవ్ర సంచలనంగా మారింది.