HomeజాతీయంBMS Apps Ban: ఒక్క క్లిక్ తో ఈ-రిక్షా షట్‌ డౌన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం!

BMS Apps Ban: ఒక్క క్లిక్ తో ఈ-రిక్షా షట్‌ డౌన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం!

ఈ-రిక్షాల భద్రతపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమానాస్పదంగా భావిస్తున్న కొన్ని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) యాప్‌లను వెంటనే యాప్‌స్టోర్‌ల నుంచి తొలగించాలని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్‌ల ద్వారా ఈ-రిక్షాల బ్యాటరీ వ్యవస్థను రిమోట్‌గా నియంత్రించే అవకాశం ఉందన్న నివేదికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

బీఏటీ-బీఎంఎస్, స్మార్ట్ బీఎంఎస్, లాస్సీజీవైతో పాటు మరో నాలుగు యాప్‌లను తొలగించాలని కేంద్రం సూచించింది. ఈ యాప్‌లు బ్లూటూత్ ద్వారా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కనెక్ట్ అయ్యి, అవసరమైతే రిమోట్‌గా బ్యాటరీని షట్‌డౌన్ చేసే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణంలో ఉన్న ఈ-రిక్షాలు ఒక్కసారిగా ఆగిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఈ-రిక్షాలు రోడ్డుపైనే అకస్మాత్తుగా నిలిచిపోవడం కనిపించింది. ఈ ఘటనల వెనుక బీఎంఎస్ యాప్‌ల ద్వారా బ్యాటరీ వ్యవస్థను రిమోట్‌గా నిలిపివేయడమే కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

సాధారణంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వాహనంలోని బ్యాటరీ పనితీరును పర్యవేక్షిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్, కరెంట్, చార్జింగ్ స్థాయి, ఉష్ణోగ్రత వంటి వివరాలను గమనిస్తూ భద్రతను నిర్ధారిస్తుంది. అయితే నాణ్యత లేని బ్యాటరీల్లో భద్రతా వ్యవస్థలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి బ్యాటరీలను కొన్ని సందర్భాల్లో బ్లూటూత్ ద్వారా, సరైన భద్రతా నియంత్రణలు లేకపోతే, రిమోట్‌గా యాక్సెస్ చేసే అవకాశం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగానే వినియోగదారుల భద్రత దృష్ట్యా అనుమానాస్పద యాప్‌లపై కేంద్రం చర్యలు చేపట్టింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు