తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి తోడు, విద్యార్థులకు పాలు అందించాలనే నిర్ణయాన్ని అమలు చేయనుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలను అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, రాష్ట్రంలోని పాడి రైతులకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి, పశువుల సంఖ్యపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆధునిక పద్ధతులతో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి, రైతులకు అదనపు ఆదాయ వనరులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇక పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, రాష్ట్రంలో అవసరానికి సరిపడా పాల ఉత్పత్తి జరగడం లేదని వెల్లడించారు. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ సమస్యను అధిగమించాలంటే పాడి రైతులను ప్రోత్సహించడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకం విద్యార్థులలో మంచి స్పందన పొందుతోంది. ఈ పథకం కింద వారంలో ప్రతి రోజు వేర్వేరు ఆహార పదార్థాలు అందిస్తున్నారు. సోమవారం దోసె-చట్నీ లేదా చపాతీ-కర్రీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ-సాంబార్, బుధవారం పూరి-ఆలూ కుర్మా, గురువారం ఇడ్లీ-సాంబార్, శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్, శనివారం బోండా-చట్నీ వడ్డిస్తున్నారు.
అదనంగా వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావా అందించడం ద్వారా విద్యార్థులకు సమతుల ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, పాఠశాల హాజరు శాతం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.