క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసెంబ్లీ సాక్షిగానే టీవీకే, డీఎంకే పార్టీల మధ్య జరిగిన వ్యక్తిగత విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్.. ముఖ్యమంత్రి, నటుడు విజయ్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని, వైవాహిక విదాలను ప్రస్తావిస్తూ.. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం భార్య వెతుకుతున్న ఉదంతం అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. రైతుల నిరసనలపై సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షాలు ఉసిగొల్పడం వల్లే రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ సీఎం విజయ్ అనడం అన్నదాతలను అవమానించడమేనని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన విజయ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ.. “సీఎం విజయ్ అసెంబ్లీలో పిట్టకథలు చెప్పడం మానేయాలి. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం వెతుకుతున్న భార్య కథ తమిళనాడు మొత్తానికి తెలుసు. కాబట్టి విజయ్ గారు.. ఆ విషయాలను ఇప్పటికైనా మర్చిపోతే మంచిది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 27 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విజయ్ భార్య సంగీత డిసెంబర్ 2025లో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ హైప్రొఫైల్ కేసు కోర్టులో నడుస్తుండగా.. ఆగస్టు 7వ తేదీన తదుపరి విచారణ జరగనుంది.
ఈ సున్నితమైన అంశాన్ని ఉదయనిధి రాజకీయాల్లోకి లాగడం హాట్ టాపిక్‌గా మారింది. సభ వెలుపల కూడా ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్ ప్రసంగంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయ్ 30 నిమిషాల ప్రసంగం కేవలం సోషల్ మీడియా రీల్స్ కోసమే డిజైన్ చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. “టీవీకే పార్టీ అసెంబ్లీని సినిమా థియేటర్లా మార్చేసింది. సభలో ఈలలు వేస్తున్నారు. త్వరలోనే మంత్రులు పాటలు పాడి, ఐటెం సాంగ్స్‌కు డ్యాన్స్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం సాగుతున్న కృత్రిమ నటన. ఇక్కడ స్పీకర్ యాక్షన్, కట్ చెప్తున్నారు.. వీళ్లు వన్స్ మోర్ టేకుల కోసం వెళ్తున్నారు. త్వరలోనే సభలోకి కారవాన్లు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ మాస్టర్లు కూడా వస్తారు. అసెంబ్లీని షూటింగ్ స్పాట్ చేసేలా ఉన్నారు” అంటూ తీవ్రంగా విమర్శించారు.
అంతకుముందు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం విజయ్ మాట్లాడుతూ డీఎంకేను గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “పార్టీ నిధుల వసూళ్లు” అనే నెపంతో గత డీఎంకే ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని, ఆ నిధులను తమ ప్రభుత్వం తిరిగి రాబడుతుందని విజయ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావివ్వదని, ఖజానాను లూటీ చేయనివ్వదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేసిన ‘అంతా సెటిల్ అయిపోయింది’ అనే అర్ధం వచ్చే ప్రసిద్ధ చేతి సైగను విజయ్ సభలో అనుకరిస్తూ చూపించారు. డీఎంకే సభ్యులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డు తగలవద్దని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలతో తమిళనాట రాజకీయ సెగలు గరిష్ఠ స్థాయికి చేరాయి.