క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : జాతీయ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన మంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. మోదీ క్యాబినెట్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన హఠాత్తుగా పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జార్జి కురియన్ రాజీనామా వెనుక ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు. ఆయన రాజ్యసభ సభ్యత్వ కాల పరిమితి ముగియడమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ 21వ తేదీతో కురియన్ రాజ్యసభ పదవీ కాలం ముగిసింది.
సాధారణంగా పార్లమెంట్లో సభ్యుడిగా లేని వ్యక్తి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే.. ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఆయన్ను తిరిగి ఎగువ సభకు నామినేట్ చేయలేదు. దీంతో సాంకేతిక నిబంధనల ప్రకారం.. సభ్యత్వ కాలం ముగిసిపోవడంతో ఆయన తన పదవిని వీడక తప్పలేదు. ప్రస్తుత నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న ఏకైక క్రిస్టియన్ సామాజికవర్గ ప్రతినిధి జార్జి కురియన్ కావడం గమనార్హం. ఆయన కేంద్ర సహాయ మంత్రి హోదాలో మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పాడిపరిశ్రమ, పశుపోషణ వంటి కీలక రంగాల బాధ్యతలను కూడా విజయ వంతంగా నిర్వహించారు. కేరళకు చెందిన ఈ సీనియర్ నేతకు గత కేబినెట్ విస్తరణలో మోదీ జట్టులో ప్రాతినిధ్యం లభించింది.
ఇప్పుడు ఆయన పదవీకాలం ముగియడంతో క్యాబినెట్లో మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యంపై సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. బీజేపీ అధిష్ఠానం ఈసారి రాజ్యసభ నామినేషన్ల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. కేవలం జార్జి కురియన్ మాత్రమే కాకుండా.. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న మరో కీలక నేత రవ్నీత్ సింగ్ బిట్టూను కూడా ఈ విడత పార్టీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. రవ్నీత్ సింగ్ బిట్టూ పరిస్థితి కూడా ప్రస్తుతం కురియన్ లాగే ఉండటంతో.. రానున్న రోజుల్లో కేంద్ర కేబినెట్లో మరికొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం గట్టిగా కనిపిస్తోందని ఢిల్లీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కురియన్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ శాఖల బాధ్యతలను ప్రధాని మోదీ ఎవరికి అప్పగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.