Homeజాతీయంపెరిగిన ఎన్డీఏ బలం.. టీఎంసీ రెబల్ ఎంపీల మద్దతుతో బలోపేతం.!

పెరిగిన ఎన్డీఏ బలం.. టీఎంసీ రెబల్ ఎంపీల మద్దతుతో బలోపేతం.!

క్రైమ్ మిర్రర్,పాలిటిక్స్:- కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఎన్డీఏ ఇప్పుడు మరింత శక్తివంతమైంది. 2014, 2019 ఎన్నికల్లో బిజెపి సొంతంగానే మెజారిటీ సాధించినప్పటికీ.. 2024లో జరిగిన ఎన్నికల్లో మెజారిటీకి ఆమడ దూరంలో నిలిచిపోయింది. దీంతో మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, బీహార్ లోని జెడియు మద్దతు ఎన్డీఏకు అత్యవసరమైంది. ఈ రెండు పార్టీలకు కలిపి 28 మంది ఎంపీలు ఉండడంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు సవ్యంగా సాగింది. గడచిన రెండేళ్లుగా మిత్రపక్షాలతో కూడిన ప్రభుత్వాన్ని బిజెపి నడుపుతోంది. అయితే, ఇప్పటికి బిజెపి ముఖ్య నాయకుల్లో సొంతంగా బలం లేదన్న ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే వీలు చిక్కిన చోటల్లా వివిధ పార్టీల్లో రెబల్ నాయకులను చేరదీస్తూ వారిని తమకు దగ్గర చేర్చుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. మహారాష్ట్ర శివసేనలో ఇటువంటి ఫార్ములా అనుసరించిన బిజెపి.. తాజాగా పశ్చిమబెంగాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించి తమకు అవసరమైన ఎంపీల బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీలు 20 మందిని తమకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఎన్డీఏ మరింత బలోపేతం కానుంది. ఈ మేరకు తృణమూల్ రెబల్ ఎంపీలు 20 మంది ఎన్డిఏ కూటమిలో ప్రత్యేక సమూహంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ కు లేఖ రాశారు. దీంతో భారతీయ జనతా పార్టీకి మరో 20 మంది ఎంపీల మద్దతు అదనంగా లభించినట్లు అయింది. ఇదే బాటలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది మంది ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేసేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.

313 కు చేరిన ఎన్డీఏ కూటమి బలం..

గడచిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ బలం 293గా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య 313 కు చేరుకోనుంది. దీంతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి మరింత బలోపేతం అయింది. ఇకపోతే తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూటమికి దూరంగా ఉంటున్న డిఎంకె కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం డీఎంకేకు లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని భావిస్తున్న కీలక బిల్లులకు ఎటువంటి అడ్డంకి లేకుండా చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే బిజెపి పశ్చిమ బెంగాల్ కు చెందిన ఎంపీలను తమ బాటలోకి తెచ్చుకున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఈ బలంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జేడీయు మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూ వస్తున్న బిజెపికి ఇబ్బందులు లేకుండా మిగిలిన మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యే అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జేడీయు, తెలుగుదేశం పార్టీ మద్దతు అనివార్యం కావడంతో వారికి అనుకూలంగా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. తాజాగా పెరిగిన బలంతో ఆ రెండు పార్టీలకు బిజెపి భయపడాల్సిన పని ఉండదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత సుస్థిరంగా పాలన సాగించేందుకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఏపీలో అట్టహాసంగా యోగాంధ్ర వేడుకలు.. చీఫ్ గెస్ట్ గా రాందేవ్ బాబా

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు