బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథాలజికల్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యాధునిక సాంకేతికత, భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు.
4 వేల కోట్లతో.. రెండు భాగాలుగా..
దాదాపు రూ.4,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
మండోదరిగా కాజల్ అగర్వాల్
ఇప్పటికే ఈ చిత్రంలో మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయాన్ని కాజల్ స్వయంగా ధృవీకరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘రామాయణ’లో రావణుడి భార్య మండోదరిగా నటిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని కాజల్ చెప్పారు. భారతీయ సినీ చరిత్రలో ఇంతటి స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్ట్ లో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించింది. సాంకేతికంగా, విజువల్ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
భారతీయ సంస్కృతి, పురాణాలకు ప్రతిబింబం
అలాగే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, పురాణాలకు ప్రతిబింబంగా నిలిచే కథ అని కాజల్ చెప్పుకొచ్చారు. దర్శకుడు నితీశ్ తివారీ ఈ కథను ఎంతో భావోద్వేగంగా, హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కిస్తున్నారని ప్రశంసించారు. ఇంత భారీ ప్రాజెక్ట్ లో నటించడం తన కెరీర్లో ఇదే మొదటిసారి అని చెప్పిన కాజల్, సినిమా విడుదల కోసం తాను కూడా అభిమానుల్లాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ‘రామాయణ’పై సినీ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.