HomeజాతీయంVeena Vijayan: మనీలాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురు ఈడీ సమన్లు

Veena Vijayan: మనీలాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురు ఈడీ సమన్లు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్ కు ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సీఎంఆర్ఎల్-ఎక్సాలాజిక్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులో భాగంగా జూన్ 12న కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వీణా విజయన్‌తో పాటు మరో తొమ్మిది మందికి కూడా నోటీసులు పంపినట్లు సమాచారం.

ఇంతకీ ఏంటీ కేసు?

ఈ కేసు కేంద్రబిందువుగా ఉన్న ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థ వీణా విజయన్‌కు చెందినది. ఈ సంస్థ, సీఎంఆర్ఎల్ అనే ప్రైవేట్ మైనింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సీఎంఆర్ఎల్ సంస్థ ఎక్సాలాజిక్‌కు కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఆ చెల్లింపులకు తగిన విధంగా ఎలాంటి సేవలు అందించలేదని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆదాయపు పన్ను శాఖ విచారణలో, సర్వీసులు లేకుండానే నిధులు బదిలీ అయ్యాయని పేర్కొంది. ముఖ్యమంత్రి కుటుంబంతో ఉన్న సంబంధాల కారణంగానే ఈ చెల్లింపులు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ అంశంపై ఇప్పటికే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) కంపెనీల చట్టం కింద కేసు నమోదు చేసింది. అనంతరం మనీలాండరింగ్ కోణంలో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. అక్రమంగా నిధులు మళ్లించారనే ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తోంది.

వీణా విజయన్ నివాసంలో ఈడీ తనిఖీలు

ఇదిలా ఉండగా, ఈడీ విచారణను నిలిపివేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో దర్యాప్తు వేగం పెరిగింది. తీర్పు వచ్చిన వెంటనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి, తిరువనంతపురంలో వీణా విజయన్‌కు సంబంధించిన నివాసంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.  తాజాగా సమన్లు జారీ కావడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. విచారణలో వీణా విజయన్ ఎలాంటి వివరణ ఇస్తారు? ఈడీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? అనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు