హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్ అయిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుండి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. లోన్ రికవరీ ఏజెంట్ల తీవ్ర మానసిక వేధింపుల వల్లే ఆమె ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మృతురాలిని నాగోల్ ప్రాంతంలో నివసిస్తున్న రోజా రమణి (26) గా గుర్తించారు. ఆమె మాదాపూర్‌లోని ప్రముఖ మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. రోజా రమణి ఆఫీసుకి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా మాదాపూర్, దుర్గంచెరువు పరిసరాల్లో పోలీసులు గాలించారు. కేబుల్ బ్రిడ్జిపై ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించగా.. ఆమె బ్రిడ్జిపై నుండి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి.
మితి మీరిన లోన్ రికవరి ఏజెంట్ల వేధింపులు…
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, రోజా రమణి ఆన్‌లైన్ యాప్స్ లేదా ఇతర మార్గాల్లో లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సకాలంలో ఈఎంఐ చెల్లించలేదనే నెపంతో లోన్ రికవరీ ఏజెంట్లు గత కొన్ని రోజులుగా ఆమెను ఫోన్ల ద్వారా తీవ్రంగా వేధించారు. ఆమె వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేస్తామంటూ, కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి పంపుతామంటూ బ్లాక్‌మెయిల్ చేసినట్లు సమాచారం. ఈ అవమానాన్ని తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురైన యువతి కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి తనువు చాలించింది. ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి మొబైల్ డేటాను విశ్లేషించి వేధింపులకు గురిచేసిన లోన్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.