సూరత్, క్రైమ్ మిర్రర్: గుజరాత్, మహారాష్ర్ట హైవేపై రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఏడుగురి మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేపింది. దీంతో ఎక్కడ చూసిన అర్తనాదాలే వినపడి ఆ ప్రాంతంలో భీతావహా వాతావరణం నెలకొంది. రెండు బస్సులు, ఒక ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమవగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బర్దోలి తాలూకాలోని ఊవా, మానేక్‌పూర్ గ్రామాల మధ్య ఉన్న ధూలే-సూరత్ జాతీయ రహదారిపై ఈ విషాదం చోటుచేసుకుంది. ధూలే నుంచి నవాపూర్ మీదుగా సూరత్‌కు వెళ్తున్న ఒక ఎస్టీ బస్సు, ఎదురుగా వస్తున్న మరో ఎస్టీ బస్సును బలంగా ఢీకొట్టింది.
ఈ భీకర ప్రమాద ధాటికి బస్సుల్లో ఒకటి జాతీయ రహదారిపైనే బోల్తా పడింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సు బోల్తా పడిన కొద్ది క్షణాల్లోనే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి, మంటలు క్షణాల వ్యవధిలో వాహనం అంతటా వేగంగా వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులకు బయటకు వచ్చే అవకాశం కూడా లభించలేదు. ఫలితంగా ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సూరత్ రూరల్ ఎస్పీ రాజేశ్ గధియా మాట్లాడుతూ.. ‘అగ్నిమాపక దళం బస్సులో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను రక్షించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాం. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం బార్డోలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం’ అని అన్నారు.