లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఆటో డ్రైవర్ గా మారిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహిళా ఆంత్రప్రెన్యూర్ డాక్టర్ నజ్రీన్ మిధ్లాజ్ సదరు ఆటో డ్రైవర్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోగా, ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
సాధారణంగా ఆటో డ్రైవింగ్ వృత్తిలో ఎక్కువగా పురుషులే కనిపిస్తారు. అయితే ఒక మహిళ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆటో నడుపుతుండటం చూసిన నజ్రీన్ మిధ్లాజ్ ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణం సమయంలో ఆ మహిళతో మాట్లాడిన ఆమె, ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆ మహిళ తన గత జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను గతంలో ఐటీ రంగంలో మేనేజర్ గా తొమ్మిదేళ్ల పాటు పనిచేసినట్లు చెప్పారు. ఆ ఉద్యోగంలో ఏడాదికి లక్షల రూపాయలు సంపాదించినప్పటికీ, తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆందోళన, నిరంతర పనిభారం తనను ఇబ్బంది పెట్టాయని తెలిపారు. ఉద్యోగంలో డబ్బు ఉన్నా ప్రశాంతత లేదని భావించి చివరకు ఆ వృత్తిని వదిలేసినట్లు చెప్పారు.
నెలకు రూ. 60 వేల సంపాదన
ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ వృత్తి ద్వారా నెలకు సుమారు రూ.60 వేల వరకు సంపాదిస్తున్నానని చెప్పారు. అంతకంటే ముఖ్యంగా, ఇప్పుడు తాను చాలా సంతోషంగా, మానసికంగా ప్రశాంతంగా ఉన్నానని వెల్లడించారు. డబ్బు మాత్రమే జీవితంలో అన్నీ కాదని, మనసుకు నచ్చిన పని చేయడం కూడా అంతే ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు.
She Left Her IT Manager Job to Drive an Auto And Says She's Finally at Peace.
A Bengaluru woman is drawing attention online after leaving her IT manager role of nine years to become an auto-rickshaw driver. Despite walking away from a corporate career, she reportedly earns… pic.twitter.com/YtBuyGporA
— The Brief India (@TheBrief_India) May 30, 2026
ఈ సంభాషణ తనపై ఎంతో ప్రభావం చూపిందని నజ్రీన్ మిధ్లాజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. జీవితంలో విజయాన్ని కేవలం జీతంతో కొలవలేమని, వ్యక్తిగత సంతృప్తి కూడా చాలా ముఖ్యమని ఆమె అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక మంది నెటిజన్లు స్పందించారు. చాలామంది మహిళా ఆటో డ్రైవర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. అధిక జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి తనకు ఇష్టమైన, ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకోవడం నిజంగా గొప్ప విషయం అన్నారు.