భార్య తిరిగి కాపురానికి రావడం లేదనే కారణంతో ఓ భర్త దారుణ చర్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ వివాదం చివరకు ప్రాణాపాయ స్థాయికి చేరిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భార్యతో పాటు అత్తమామలు, చిన్నారులు ఇంట్లో ఉన్న సమయంలోనే ఇంటికి నిప్పంటించి వారిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
పోలీసుల వివరాల ప్రకారం.. హత్నూర మండలం దౌలాపూర్ గ్రామంలో ఈ నెల 14 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌కు చెందిన నాగరాజుకు 2018లో దౌలాపూర్ గ్రామానికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. ప్రారంభంలో వారి దాంపత్య జీవితం సజావుగానే సాగినట్లు సమాచారం. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే కాలక్రమేణా కుటుంబంలో విభేదాలు పెరిగినట్లు తెలిసింది.
నాగరాజు మద్యానికి అలవాటు పడి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించినట్లు సమాచారం. ఈ వేధింపులు పెరగడంతో కొన్ని నెలల క్రితం లావణ్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భార్యను పలుమార్లు సంప్రదించిన నాగరాజు తిరిగి కాపురానికి రావాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు, నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భార్య తిరిగి రాకపోవడంతో ఈ నెల 14 అర్ధరాత్రి నాగరాజు దౌలాపూర్ గ్రామానికి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడ అత్తారింటి బయట తలుపులకు గడియ పెట్టిన తర్వాత ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. అనంతరం భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి నిప్పుపెట్టిన విషయాన్ని తెలిపినట్లు సమాచారం. దీంతో ఇంట్లో ఉన్న లావణ్య, ఆమె తల్లిదండ్రులు, ఇద్దరు చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇల్లు మంటల్లో చిక్కుకోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. ఘటనపై సమాచారం అందుకున్న హత్నూర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నాగరాజు పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ALSO READ: యువతి ఆవేదన.. నా భర్త బాత్రూమ్లో వీడియోలు తీసి.. (VIDEO)