ఒకప్పుడు ఎంతో ఇష్టపడి యూకేకు వెళ్లిన భారతీయులు, ఇప్పుడు ఆ దేశానికి గుడ్ బై చెప్తున్నారు. గత కొంత కాలంగా వేలాది మంది బ్రిటన్ ను వదిలేసి స్వదేశానికి చేరుకున్నారు. మరికొంత మంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు. కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం వంటి కారణాలతో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఆ దేశాన్ని విడిచి వెళ్తున్నారు. ఇందులో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ONS తాజాగా నివేదికలో కీలక విషయాలు వెల్లడి!
యూకే ప్రభుత్వానికి చెందిన ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాది వేలాదిమంది భారతీయులు బ్రిటన్ను విడిచి వెళ్లిపోయారు. ముఖ్యంగా చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లిన యువత ఎక్కువగా తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. చదువుల కోసం యూకే వెళ్లిన సుమారు 51 వేల మంది భారతీయులు గత ఏడాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే ఉద్యోగాల కోసం వెళ్లిన మరో 21 వేల మంది కూడా యూకేను వదిలారు. వీరితో పాటు ఇతర వ్యక్తిగత కారణాల వల్ల మరో 3 వేల మంది భారతీయులు కూడా దేశం విడిచినట్లు నివేదిక చెబుతోంది.
యూకేను ఎందుకు వదిలేస్తున్నారంటే?
యూకేలో ఇటీవల వీసా నిబంధనలు మరింత కఠినంగా మారాయి. ముఖ్యంగా విద్యార్థులు, వర్క్ వీసాలపై ఉన్న నియమాలు విదేశీయులకు ఇబ్బందిగా మారుతున్నాయి. మరోవైపు హౌస్ రెంట్స్, ఫుడ్, ట్రాన్స్ పోర్ట్ లాంటి ఖర్చులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో ఉద్యోగాల మార్కెట్ కూడా అంతగా బలంగా లేకపోవడంతో అక్కడ స్థిరపడాలని భావించిన చాలామంది తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు.
భారతీయుల తర్వాత ఎక్కువ సంఖ్యలో యూకే విడిచి వెళ్లిన వారిలో చైనా, పాకిస్థాన్, నైజీరియా, ఉక్రెయిన్ దేశాల ప్రజలు ఉన్నారు. అయితే ఈ జాబితాలో భారతీయులే మొదటి స్థానంలో ఉండటం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా చదువులు, ఉద్యోగాల కోసం యూకేకు వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారుతుండటంతో చాలామంది తిరిగి స్వదేశానికి రావడంచ, ఇతర దేశాల వైపు చూడడం ప్రారంభించినట్లు నిపుణులు చెబుతున్నారు.