వెనకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా, విద్యాపరంగా ఇప్పటికే మంచి స్థాయికి చేరుకున్న కుటుంబాల పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు అవసరమా? అని ప్రశ్నించింది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం సరైందా? అనే అంశంపై సందేహం వ్యక్తం చేసింది.
క్రిమీలేయర్ విధానం కీలక విచారణ
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఆ వ్యక్తి తల్లిదండ్రులిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారని, అందువల్ల రిజర్వేషన్ వర్తించదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా ధర్మాసనం రిజర్వేషన్ల అమలుపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. “ఒకవేళ తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులైతే, వారి పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఎందుకు అవసరం? వారు ఇప్పటికే విద్యా, ఆర్థికంగా ముందుకు వచ్చారు కదా” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడమే!
రిజర్వేషన్ల ఉద్దేశం వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడమేనని, కానీ ఒక కుటుంబం ఇప్పటికే మంచి స్థితికి చేరుకున్న తర్వాత కూడా అదే ప్రయోజనాలు తరతరాలుగా కొనసాగితే సమానత్వం దెబ్బతింటుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలా కొనసాగితే రిజర్వేషన్ వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటకు రాలేమని కూడా వ్యాఖ్యానించింది. జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఉన్నత స్థానాలకు చేరితే పిల్లల జీవన పరిస్థితులు కూడా మారతాయని చెప్పారు. అందువల్ల రిజర్వేషన్ల అమలులో సమతుల్యత చాలా అవసరమన్నారు. రిజర్వేషన్ల వల్ల లాభపడి ఆర్థికంగా, సామాజికంగా బలపడిన కుటుంబాలు తమ తర్వాతి తరానికి కూడా అదే ప్రయోజనం అవసరమా? అనే విషయాన్ని ఆలోచించుకోవాలని సూచించారు.
ఇక మంచి ఉద్యోగాలు, అధిక ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు అవసరం లేదని గతంలో కూడా పలు తీర్పుల్లో కోర్టులు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.