కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే మార్పులు, చేర్పులు ఉండొచ్చన్న చర్చలు ఢిల్లీలో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచింది. మంత్రులు తమ శాఖల పనితీరు నివేదికలతో సమావేశానికి హాజరుకాగా, ఇప్పటికే పీఎంఓ ఆయా శాఖలపై ప్రత్యేకంగా సమీక్షా నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. వాటిని చూసిన తర్వాత పలువురు మంత్రులు ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
పలువురి పనితీరుపై ప్రధాని అసంతృప్తి
సమావేశం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత, క్యాబినెట్ కార్యదర్శి ఒక్కో మంత్రిత్వ శాఖ పనితీరును వివరించినట్లు తెలిసింది. మంత్రులు, వారి శాఖల కార్యదర్శులు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన కార్యక్రమాలు, లక్ష్యాల సాధనలో ఎదురైన సమస్యలు వంటి అంశాలపై చర్చ జరిగింది. కొన్ని శాఖలు ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయలేదని ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రత్యేకంగా పనితీరు బలహీనంగా ఉన్న శాఖలపై మోదీ గట్టిగా స్పందించినట్లు చెబుతున్నారు. కొన్ని పథకాలు ప్రజలకు చేరడంలో ఆలస్యం కావడం, ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలపై మంత్రులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సమావేశం ముగిసే సమయానికి పలువురు మంత్రుల్లో ఉత్కంఠ కనిపించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో కొనసాగిస్తారా? శాఖ మారుతుందా? లేక పూర్తిగా తప్పిస్తారా? అన్న సందేహాలు కొందరు మంత్రుల్లో వ్యక్తమైనట్లు సమాచారం.
స్వతంత్ర, సహాయమంత్రులు సైతం హాజరు
ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రే ఢిల్లీకి చేరుకోగా, గురువారం సాయంత్రం సేవా తీర్థ్ లోని తన కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 30 మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శులు కూడా హాజరయ్యారు. మోదీ మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టి జూన్ 9 నాటికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పనితీరును సమీక్షిస్తూ భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.