HomeజాతీయంMilk Prices Hike: పాల ధరల షాక్‌.. అమల్లోకి అమూల్‌, మదర్‌ డెయిరీ కొత్త రేట్లు!

Milk Prices Hike: పాల ధరల షాక్‌.. అమల్లోకి అమూల్‌, మదర్‌ డెయిరీ కొత్త రేట్లు!

దేశంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థలైన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, మదర్ డైరీ పాల ధరను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అమూల్‌ బ్రాండ్ పేరుతో పాలను విక్రయిస్తున్న జీసీఎంఎంఎఫ్‌ లీటరు పాలపై రూ.2 పెంచగా, మదర్‌ డెయిరీ కూడా అదే స్థాయిలో ధరలను సవరించింది. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

వినియోగదారులపై మరింత భారం

ఈ ధరల పెంపుతో సాధారణ వినియోగదారులపై మరింత భారం పడనుంది. ముఖ్యంగా ప్రతి రోజు పాలను వినియోగించే కుటుంబాలకు నెలవారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో పాల ధరలు కూడా పెరగడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

ధరలు ఎందుకు పెరిగాయంటే?

జీసీఎంఎఫ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ఏడాది పశువుల దాణా ధరలు పెరిగాయి. అలాగే పాల ప్యాకెట్ల తయారీలో ఉపయోగించే ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ ఖర్చులు కూడా అధికమయ్యాయి. దీనికి తోడు ఇంధన ధరలు పెరగడంతో రవాణా వ్యయం కూడా భారీగా పెరిగిందని సంస్థ అందిస్తుంది. ఈ కారణాల వల్ల పాల ఉత్పత్తి మరియు సరఫరా ఖర్చులు పెరగడంతో ధరలు సవరించినట్లు తెలిపింది.

అటు మదర్‌ డెయిరీ ప్రధానంగా ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున పాలను సరఫరా చేస్తోంది. ఆ ప్రాంతాల్లో కూడా కొత్త ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. రైతులకు సరైన ధర అందించడంతో పాటు నాణ్యమైన పాలను కొనుగోలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

పాల ధరల పెంపు కారణంగా టీ దుకాణాలు, హోటళ్లు, స్వీట్లు తయారీదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. చాలా చిన్న వ్యాపారులు ఇప్పటికే పెరిగిన ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజా ధరల పెంపు మరింత ఒత్తిడిని తీసుకురానుందని చెబుతున్నారు. అయితే, కంపెనీలు పెరిగిన ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు