పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. ముఖ్యంగా ముడి చమురు ఉత్పత్తి, సరఫరాలో కీలక పాత్ర పోషించే ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌పైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు మరికొంత కాలం కొనసాగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్పదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అదనపు ఖర్చును భరిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితిని ఎక్కువకాలం కొనసాగించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
స్విట్జర్లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొన్న సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే పెరుగుతున్నాయని, అయినప్పటికీ దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కూడా నష్టాలను భరిస్తూ వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయని వెల్లడించారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు మరింత దిగజారితే ఈ భారాన్ని ప్రభుత్వ సంస్థలు భరించడం కష్టమవుతుందని, ఆ ప్రభావం చివరికి వినియోగదారులపై పడే అవకాశముందని హెచ్చరించారు.
ఇక దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలకు కీలక సూచనలు చేశారు. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాలంటే ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని ప్రజలను కోరారు. అనవసర ప్రయాణాలు తగ్గించడం, ఇంధన పొదుపు పాటించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వవచ్చని సూచించారు. అంతేకాదు బంగారం కొనుగోళ్లను కూడా కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ స్థాయిలో బంగారం దిగుమతులు జరగడం వల్ల విదేశీ కరెన్సీపై ఒత్తిడి పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బంగారం దిగుమతి సుంకాలను కేంద్రం రెట్టింపు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెల నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరుకుంది. మార్చిలో ఇది 3.40 శాతంగా నమోదైంది. ప్రస్తుతం పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడితే రవాణా ఖర్చులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావం ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలపై కూడా పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని భారత రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అదే సమయంలో సగటు ద్రవ్యోల్బణం 4.6 శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నందున ప్రతి పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణం మరింత ముదిరితే దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడి పడే అవకాశముందని, అందుకే ప్రభుత్వం, ఆర్బీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు