హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ విసిగిపోయి మనస్తాపం చెందిన నిన్న(గురువారం) ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(55) మృతి చెందాడు. ఇవాళ రాత్రి 2.30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మహాధర్నా చేపట్టిన నర్నంపేట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోనే శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలు ఆర్పిన తోటి కార్మికులు అతన్ని హుటాహుటిన కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. శంకర్ గౌడ్ మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం అతని పార్థివదేహాన్ని కుటుంబసభ్యులు వారి స్వగ్రామం ఖానాపురం మండలం ముత్తోజిపేటకి తరలించారు. కాగా, శంకర్ గౌడ్‌కు భార్య లత, కుమారుడు హేమంత్, కుమార్తె షామిలీ ఉన్నారు. శంకర్ గౌడ్ మృతితో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
మరోవైపు డ్రైవర్ మృతిపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోనందునే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.