-
జగిత్యాల సభలో కనిపించని యువనేత
-
కనీసం సభ పై స్పందించని వైనం
-
అయోమయంలో గులాబీ క్యాడర్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ అసంతృప్తితో ఉన్నారా? లేకుంటే అలిగారా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. జగిత్యాల సభను విజయవంతం చేసేందుకు ఆయన భారీ జన సమీకరణ చేపట్టారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. కానీ చివరికి సభకు మాత్రం హాజరు కాలేదు. అటు తరువాత పరిణామాలపై కూడా పెద్దగా స్పందించలేదు. అందుకే కేటీఆర్ మౌనం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం వెనుక ఏదో జరిగిందన్న అనుమానం తెలంగాణ సర్కిల్స్ లో ఉంది.
ఏడాదిన్నర తరువాత…
ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. కాంగ్రెస్ కురువృద్ధుడు జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరే క్రమంలో జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేటీఆర్ ఆ సభలో మెరవకపోవడం వెనుక ఏదో ఒకటి జరిగిందన్న అనుమానం ఉంది. కనీసం ఆ సభ విజయవంతం పై సోషల్ మీడియాలో కూడా ఆయన స్పందించలేదు. నిన్నటి వరకు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన గత కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. దీనిపైనే రకరకాల చర్చ నడుస్తోంది. తెర వెనుక గులాబీ పార్టీ లక్ష్యంగా ఏదో జరుగుతుందన్న అనుమానం బలపడుతోంది.
రేవంత్ విమర్శలపై ఏది…
గులాబీ పార్టీ నాయకత్వం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా మాట్లాడుతున్నారు. కానీ కేటీఆర్ నుంచి ఆ స్థాయిలో కౌంటర్ అటాక్ లేదు. సాధారణంగా రేవంత్ రెడ్డి చేసే ప్రతి విమర్శకు గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టి ఎండ కట్టేవారు కేటీఆర్. ఇప్పుడు అసలు స్పందించకపోవడం చూస్తుంటే క్యాడర్ అయోమయంలో పడుతోంది. అయితే ఇది ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు అనుసరిస్తున్న సైలెంట్ స్ట్రాటజీ అని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతోనే కేటీఆర్ సైలెంట్ అయ్యారు అని అన్నవారు ఉన్నారు.
పార్టీ నాయకత్వం విషయంలో…
గులాబీ పార్టీని ఎలా ముందుకి తీసుకెళ్లాలని దానిపై అగ్ర నేతల్లో విభేదాలు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావుల మధ్య అభిప్రాయ వేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకరు దూకుడుగా వెళ్లాలని భావిస్తుంటే.. మరొకరు మాత్రం వేచి చూసే ధోరణిని అనుసరించాలని సూచిస్తున్నారు. ముగ్గురు అగ్రనేతల మధ్య వ్యూహాత్మక విభేదాలు తలెత్తడం వల్లే.. ఒకరు క్రియాశీలకంగా ఉన్నప్పుడు మరొకరు సైలెంట్ అవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముగ్గురు నేతలు కలిసి పోరాటం చేయాలన్న సూచిస్తున్న క్యాడర్ కు ఈ పరిస్థితులు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. మౌనవ్రతాలు క్యాడర్ను అయోమయంలో పడేస్తున్నాయి.
ఆయన మౌనాన్ని వీడితే…
ఇంత కాలానికి కేసీఆర్ బయట ప్రపంచానికి వచ్చారు. పార్టీకి ఓటమి ఎదురైన తర్వాత ఆయన మౌనమునిలా మారిపోయారు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు కేటీఆర్. అయితే పార్టీలో ప్రాధాన్యత, నాయకత్వ బాధ్యతల విషయంలో విభేదాలు తలెత్తాయా? అందుకే కేటీఆర్ ఇలా వ్యూహాత్మకంగా మౌనం పాటించారా అనే అనుమానం కూడా ఉంది. కచ్చితంగా కుటుంబంలో ఏదో ఒక వివాదం జరిగి ఉంటుందన్న అనుమానం బలపడుతోంది. ఫ్యామిలీ పాలిటిక్స్ తో ఇప్పటికే గులాబీ పార్టీ నష్టపోయిందని… వాటికి చెప్పాల్సిందేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి అయితే కేటీఆర్ సైలెంట్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఒక సంచలనమే.