HomeజాతీయంPPA Survey: బెంగాల్‌ లో బీజేపీ సునామీ.. తమిళనాట డీఎంకే హవా.. PPA సర్వే...

PPA Survey: బెంగాల్‌ లో బీజేపీ సునామీ.. తమిళనాట డీఎంకే హవా.. PPA సర్వే షాకింగ్ అంచనా!

BJP to Win 167 Seats in Bengal: పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ప్రజాపోల్ అనలిటిక్స్ (PPA) సంస్థ చేసిన అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సంస్థ వెల్లడించిన మెగా సర్వే ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. బీజేపీ సుమారు 167 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేయగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 126 సీట్లు దక్కవచ్చని తెలిపింది. మిగతా ఒక సీటు ఇతరులకు వెళ్లే అవకాశముందని ఈ నివేదిక చెబుతోంది.

తమిళనాడులో డీఎంకే హవా

ఇక తమిళనాడు విషయానికి వస్తే, అక్కడి రాజకీయ పరిస్థితి భిన్నంగా ఉండనుంది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌కు పెద్దఎత్తున మద్దతు లభించే అవకాశం ఉందని పీపీఏ అంచనా వేసింది. ఈ కూటమి మొత్తం 150 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇందులో డీఎంకే పార్టీ ఒక్కటే 117 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు, డీఎండీకేకు 7, విసికెకు 4, సిపిఐకి 3, సిపిఐ(ఎం)కు 2 స్థానాలు దక్కవచ్చని అంచనా వేసింది.

ఎన్డీఏ కూటమి వెనుకంజ

ఇక ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే, తమిళనాడులో అది కొంత వెనుకబడే అవకాశముందని సర్వే సూచిస్తోంది. అన్నాడీఎంకేకు సుమారు 53 సీట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీకి 9 స్థానాలు దక్కవచ్చని తెలిపింది. పిఎంకెకు 7 సీట్లు, ఎఎంఎంకెకు ఒక సీటు లభించే అవకాశముందని ఈ అంచనాలు చెబుతున్నాయి.

ఈ అంచనాలపై పీపీఏ సంస్థ అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ స్పందిస్తూ, గతంలో బిహార్ ఎన్నికల ఫలితాలను తమ సంస్థ చాలా కచ్చితంగా అంచనా వేసిందని గుర్తుచేశారు. అప్పటి ఫలితాలు తమ సర్వేకు దాదాపు పూర్తిగా సరిపోవడం తమ విశ్వసనీయతను పెంచిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెల్లడించిన అంచనాలు కూడా అదే స్థాయిలో నిజం కావచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ ఓటర్ల తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి సర్వేలు కేవలం ఒక దిశను మాత్రమే సూచిస్తాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారం, స్థానిక అంశాలు, ప్రజల అభిప్రాయాలు చివరి నిమిషంలో మారే అవకాశమూ ఉంటుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు