అల్లూరి జిల్లా, క్రైమ్ మిర్రర్: అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కొదోంజొల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 11ఏళ్ల మాధవి తమ్ముడిని నద్రిపుచ్చుతూ ఉయ్యాల ఊగుతోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా తాడు మెడకు చుట్టుకొని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. కాసేపటికి తల్లి ఇంటికి వచ్చి చూడగా కూతురి మెడకు ఉయ్యాల ఉచ్చులా బిగించి ఉండటం గమనించింది. వెంటనే మాధవిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే బాలిక మృతిచెందింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వ్యవసాయ పనులకు గ్రామస్తులంతా వెళ్లడంతో చిన్నారిని కాపాడే అవకాశం లేకుండా పోయిందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. మాధవి కుసుంగుడ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదవుతోంది. తమ్ముడిని లాలించమని చెప్పి వెళ్లానని.. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. చిన్నారి మృతితో కొదోంజొల గ్రామంలో విషాదఛాయలు అముకున్నాయి.
