-
మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
-
సోమవారం రాత్రి 7.30 నుంచి అమల్లోకి
-
జలసంధి దాటి వచ్చే ఇరాన్ నౌకలను పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరిక
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం కావడంతో మళ్లీ యుద్ద మేఘాలు క మ్ముకుంటున్నాయి. 15 రోజుల కాల్పుల ఒప్పందంతో కొంత ఊపిరి పీల్చుకున్న దేశాలు ఇప్పుడు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం రాత్రి నుంచి అమెరికా బయట, ఇరాన్ లోపల హర్మూజ్‌ను దిగ్బందించాయి. కాగా గల్ఫ్ దేశాల పోర్టులకు రాకపోకలు సాగించే నౌకలను ఇరాన్ ఇప్పటికే నిలిపివేయగా… ఇప్పుడు ఇరాన్ పోర్టులకు రాకపోకలు సాగించే నౌకలను అడ్డగింతకు అమెరికా ఏర్పాట్లు చేసింది.
దీనితో హోర్ముజ్ జలసంధి పూర్తిగా మూసుకుపోయింది. ఇప్పటివరకు కొన్ని నౌకలైనా బయటికి రాగా.. ఇకపై ఒక్కటీ బయటికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇరాన్ నౌకలు జలసంధి దాటి బయటికి వస్తే పేల్చేస్తామని అమెరికా హెచ్చరిస్తే.. తమ జోలికి వస్తే గల్ఫ్ దేశాల్లోని పోర్టులు వేటికీ రక్షణ ఉండదంటూ ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఘాటుగా స్పందించింది. దీనితో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏ క్షణంలోనైనా కాల్పుల విరమణ ముగిసి, యుద్ధం మొదలుకావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో జరిగిన ఇరాన్-అమెరికా శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.
అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించకపోవడంతోనే చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందన్న ట్రంప్.. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి సోమవారం ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఇరాన్ పోర్టులకు వెళ్లే, ఆ దేశ పోర్టుల నుంచి వచ్చే నౌకలను సోమవారం సాయంత్రం 5.30 గంటల(అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల) నుంచి అడ్డుకుంటామని పేర్కొన్నారు.
అధ్యక్షుడి నిర్ణయానికి అనుగుణంగా పశ్చిమాసియాలోని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. ‘‘పర్షియన్ గల్ఫ్‌తోపాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని నౌకలను అడ్డుకుంటాం. అవి ఏ దేశానికి చెందినవైనా సరే ఈ దిగ్బంధం వర్తిస్తుంది. హోర్ముజ్ జలసంధి మీదుగా మిగతా గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే నౌకలకు ఎటువంటి ఆటంకం ఉండదు.
అయితే జలసంధి మీదుగా రాకపోకలు సాగించే అన్ని నౌకలను తనిఖీ చేసి అనుమతిస్తాం’’ అని పేర్కొంది. ఆహారం, మందులు, ఇతర అత్యవసరాలతో కూడిన నౌకలను కూడా తనిఖీ చేస్తామని తెలిపింది. అమెరికా దిగ్బంధం ప్రారంభించడానికి కాస్త ముందు రెండు ఇరాన్ చమురు నౌకలు హోర్ముజ్ దాటి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోకి ప్రవేశించినట్టు కెప్లర్, ఎల్‌ఎ్‌సఈజీ వెల్లడించాయి.
గల్ఫ్ పోర్టులకు రక్షణ ఉండదు: ఐఆర్‌జీసీ…
అమెరికాతమ జోలికి వస్తే గల్ఫ్ దేశాల్లోని పోర్టులకు రక్షణ ఉండదని, అవసరమైతే వాటిని దిగ్బంధిస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. హోర్ముజ్‌ను దిగ్బంధించామన్న అమెరికా ప్రకటనపై ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ జలాల్లో నియంత్రణలు విధించడం అక్రమమని, అది దోపిడీతో సమానమని మండిపడింది. ‘‘ఇరాన్ పోర్టుల జోలికి వస్తే.. గల్ఫ్‌లో పోర్టులకు రక్షణ లేనట్టే. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఉంటే అందరికీ భద్రత ఉండాలి. లేకుంటే ఎవరికీ ఉండదు. హోర్ముజ్ జలసంధికి సమీపంగా ఏవైనా యుద్ధ నౌకలు వస్తే.. కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టే..’’ అని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.
చమురు మంటలే.. ఇరాన్ స్పీకర్ ఫార్ములా…
హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధిస్తే ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న దానిపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘర్ గలీబఫ్ గణిత ఫార్ములాను చెప్పారు. దిగ్బంధంతో త్వరలో భారీగా చమురు ధరలు పెరుగుతాయని పేర్కొంటూ సోమవారం ఆయన ఒక ట్వీట్ చేశారు. అమెరికాలో పెట్రోల్ ధరలు ఇప్పుడున్న స్థాయిలో ఉండటం ఇక గతమేనని పేర్కొన్నారు.
’BSOH>0=f(f(O))>F(O)’ అంటూ ఫార్ములాను పెట్టారు. ఆయన దీని వివరాలు వెల్లడించపోయినా.. నిపుణులు దాన్ని డీకోడ్ చేశారు. ఇందులో బీఎ్‌సఓహెచ్ అంటే హోర్ముజ్ జలసంధి దిగ్బంధం (బ్లాకేడ్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్), ఓ అంటే చమురు, ఎఫ్ అంటే దిగ్బంధం. జలసంధిని ఇరాన్ మూసివేస్తేనే చమురు ధరలు ఇంతగా పెరిగాయని… ఇప్పుడు అమెరికా దిగ్బంధంతో అంతకు మరెన్నో రెట్లు చమురు ధరలు పెచ్చరిల్లడం ఖాయమని నిపుణులు విశ్లేషించారు.
