HomeతెలంగాణMLC Vijayashanthi: మండలిలో రాములమ్మ విశ్వరూపం!

MLC Vijayashanthi: మండలిలో రాములమ్మ విశ్వరూపం!

* తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చండి

* శాసనమండలిలో విజయశాంతి డిమాండ్

* అదే ఫైర్ బ్రాండ్ ధోరణిలో మహిళా నేత 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఊరకనే రాలేదు. ప్రజల కోసం అవసరమైతే ఎంత దూరానికైనా వెళ్తారు. ఎవరినైనా ప్రశ్నిస్తారు. అవసరం అనుకుంటే పోరాటం చేస్తారు. అది సినిమా రంగంలోనైనా.. రాజకీయరంగంలోనైనా.. తెలంగాణ ఉద్యమంలోనైనా.. లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి స్టైల్ వేరు. తాజాగా ఆమె తెలంగాణ శాసనమండలిలో అధికార పార్టీ సభ్యురాలుగా చాలా భావోద్వేగంతో మాట్లాడారు. అందరిలోనూ ఆలోచింపజేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సొంత ప్రభుత్వాన్ని సైతం డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ స్పష్టమైన హామీ..

తెలంగాణ ఉద్యమకారులపై శాసనమండలిలో చర్చ నడిచింది. కెసిఆర్ హయాంలో ఉద్యమ తెలంగాణ కాస్త బంగారు తెలంగాణ గా మారింది. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమకారులపై నిర్లక్ష్యం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు 25వేల రూపాయల పెన్షన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు సమీపిస్తోంది. అయినా సరే వారికి న్యాయం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో విజయశాంతి శాసనమండలిలో గట్టిగానే వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విజయశాంతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు విజయశాంతి. ఒకవైపు హీరోయిన్ గా రాణిస్తూ.. మరోవైపు లేడి ఓరియంటెడ్ కథలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 180 సినిమాలకు పైగా నటించారు. 1991లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను పొందారు. ఆరుసార్లు ఉత్తమ నటి గా అవార్డులు సాధించారు. 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందారు. నాలుగు సార్లు నంది పురస్కారాలను కూడా అందుకున్నారు.

రాజకీయాల్లో చెరగని ముద్ర..

రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర చాటుకున్నారు విజయశాంతి. 1998లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2005లో తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. కెసిఆర్ తో కుదిరిన ఒప్పందం మేరకు 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో తన పార్టీని విలీనం చేశారు. 2009లో మొదటిసారిగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2013లో కెసిఆర్ తో విభేదాలు ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి సస్పెండ్ కు గురయ్యారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు విజయశాంతి. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2023లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కన్వీనర్ గా నియమితులయ్యారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు విజయశాంతి. ఆమెను క్యాబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం నడిచింది. మంత్రివర్గంలోకి తీసుకుంటామన్న హామీ తోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. విజయశాంతికి ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె తెలంగాణ ఉద్యమకారుల గురించి శాసనమండలిలో వాయిస్ వినిపించడం చూస్తుంటే మాత్రం.. అందరికీ ఆశ్చర్యం వేస్తోంది. తప్పకుండా ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం క్రమేపి విస్తరిస్తోంది. ఒకరిద్దరు మహిళా మంత్రులను తప్పిస్తారన్న ప్రచారం ఉంది. వారి స్థానంలో విజయశాంతిని క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయమని టాక్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments