Homeజాతీయంతెలంగాణ‌కు కొత్త‌గా రెండు ఎయిర్ పోర్టులు...ఆదిలాబాద్‌, నాగార్జున్‌సాగ‌ర్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్...!

తెలంగాణ‌కు కొత్త‌గా రెండు ఎయిర్ పోర్టులు…ఆదిలాబాద్‌, నాగార్జున్‌సాగ‌ర్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: తెలుగు రాష్ర్టాల‌కు కేంద్రం తాజాగా మ‌రో తీపి క‌బురు చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఉడాన్ 2.0 ప‌థ‌కం ద్వ‌రా తెలుగు రాష్ర్టాల్లో విమాన సౌక‌ర్యాలు భారీగా మెరుగుప‌డ‌నున్నాయి. దీనంలో భాగంగానే తెలంగాణ లో ఆదిలాబాద్‌, నాగార్జున‌సాగ‌ర్‌లో కొత్త‌గా విమానాశ్ర‌యం నిర్మానానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఉడాన్ 2.0 కింద కేటాయించిన రూ.28,000 కోట్లతో దేశవ్యాప్తంగా 100 ఎయిర్‌పోర్టులు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయనున్నారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లభించబోయే ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను పూర్తిస్థాయి విమానాశ్రయాలుగా మార్చడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణలోని ఆదిలాబాద్, ఏపీలోని పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ లభించనుంది.

ఆదిలాబాద్‌లో ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌స్ట్రిప్‌ను తాము స్వాధీనం చేసుకోబోమని, దానికి ఆనుకుని ఉన్న అదనపు భూమిని సేకరించి పౌర విమానయాన విమానాశ్రయాన్ని నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉడాన్ 2.0 కింద కేటాయించిన రూ.28,000 కోట్లలో రూ.12,000 కోట్లు విమానాశ్రయాల అభివృద్ధికి, రూ.3,500 కోట్లు 200 హెలిపోర్టుల నిర్మాణానికి కేటాయించారు.

విమానయాన సంస్థల నష్టాలను భర్తీ చేసే ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ కోసం మరో రూ.10,000 కోట్లు వెచ్చించనున్నారు.తెలంగాణలో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు ఫైలు ప్రస్తుతం వివిధ శాఖల సంప్రదింపుల దశలో ఉందని, జూన్‌లో దీనికి శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయని, వచ్చే ఏడాది జూన్ కల్లా ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు, భారత విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పుగా ‘ఎంబ్రాయిర్’ సంస్థ దేశీయంగా విమానాల తయారీపై ఆసక్తి చూపుతోందని మంత్రి తెలిపారు. 2028 చివరి నాటికి భారత్‌లో తయారైన తొలి విమానాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ఆ సంస్థ కసరత్తు చేస్తోందని, ఇది ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా పెద్ద విజయమని ఆయన కొనియాడారు. ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే, తెలుగు రాష్ట్రాల మధ్య, దేశంలోని ఇతర ప్రధాన నగరాల మధ్య ప్రయాణ దూరం భారీగా తగ్గడమే కాకుండా ఆర్థిక ప్రగతికి బాటలు పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments