నేతల మధ్య బిగ్ ఫైట్
ఆధిపత్యం కోసం ఆరాటం
గ్రేటర్ అభ్యర్థుల ఎంపికను ఎంపీలకు విడిచి పెట్టాలని ఈటెల రాజేందర్ డిమాండ్
సొంత పార్టీ నేతలు గోతులు తవ్వుతున్నారని ఆవేదన
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర చీఫ్ ఎదుట పంచాయితీ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బిజెపిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయా? పార్టీలో నేతలు ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటున్నారా? బిజెపి రాష్ట్ర నాయకత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని నాయకులు కలత చెందుతున్నారా? గ్రేటర్ లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంపీలకు ప్రాధాన్యత లేకుండా పోతుందా? ఈ విషయంలో పార్లమెంట్ సభ్యులు ఆగ్రహం గా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వీటిని ధ్రువీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిజెపిలో సెగలు పుట్టిస్తున్నాయి. సాక్షాత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఎదుటే ఈటెల రాజేందర్ ఈ సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
* గులాబీ పార్టీలో అగ్రనేతగా..
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక వెలుగు వెలిగారు ఈటెల రాజేందర్. కానీ అనుకోని రీతిలో ఆయన బిజెపిలో చేరారు. భారతీయ జనతా పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుందని భావించారు. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి వరిస్తుందని ఆశపడ్డారు. బిజెపి నాయకత్వం మాత్రం ఆది నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.
ఈటెల రాజేందర్ పేరును పరిగణలోకి తీసుకున్నట్టే తీసుకుని ఆయనకు మొండి చేయి చూపింది. అప్పటినుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు ఈటెల రాజేందర్. మరోవైపు మరో కేంద్రమంత్రి బండి సంజయ్ తో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి.. హుజురాబాద్ లో ఓడిపోయిన రాజేందర్ సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
అయితే తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం హుజురాబాద్ కు ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు. అయితే అక్కడ తన వర్గాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. అప్పటినుంచి బండి సంజయ్ తో విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ నాయకత్వం సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ కంటే బండి సంజయ్ పై చేయి సాధించారు. దీంతో విభేదాలు మరింత తారాస్థాయికి చేరాయి.
* పార్లమెంట్ పరిధిలో మా ఇష్టం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కదలిక వచ్చింది. అయితే ఇప్పుడే ఈటెల రాజేందర్ ఒక షరతు పెడుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎంపీలకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో రాష్ట్ర నాయకత్వం ప్రభావం ఉండకూడదని భావిస్తున్నారు. ఎవరి పార్లమెంటు నియోజకవర్గాల్లో వారే అభ్యర్థులను డిసైడ్ చేస్తారని.. ఇప్పటికే తన సాటి ఎంపీలైన రఘునందన్ రావు , కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు సర్వేలు జరుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల బీజేపీ కార్యవర్గాల ఎంపిక కోసం పరిశీలకులను నియమించారు.
అయితే దానిపై మాట మాత్రం కూడా ఈటెల రాజేందర్ కు చెప్పకుండా మల్కాజిగిరి పార్లమెంటు స్థానాల్లో నియామకాలు జరిపారు. దీంతో మరింత ఫైర్ అవుతున్నారు ఈటెల. కనీసం సీనియర్ నేతగా, పార్టీ ఎంపీగా గుర్తించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* సొంత పార్టీ నేతలే కుట్ర..
ఈటెల రాజేందర్ బిజెపిని వీడుతారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. బిజెపిలో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్లిపోతారని టాక్ నడిచింది. అయితే ఈ ప్రచారం వెనుక సొంత పార్టీ నేతలు ఉన్నారని ఈటెల రాజేందర్ అనుమానిస్తున్నారు.
ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎదుట కుండ బద్దలు కొట్టి మాట్లాడారు. సొంత పార్టీ నేతలే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. విభేదాలకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతోపాటు 2028 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకోనున్నారు. పక్క పొలిటికల్ వ్యూహంతోనే ఆయన పర్యటన కొనసాగనుంది. ఇంతలోనే ఈ విభేదాలు చూస్తుంటే మాత్రం భారతీయ జనతా పార్టీలో ఒక రకమైన కలవరం నెలకొంది.
