దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాపై నెలకొన్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించే శుభవార్తను వెల్లడించింది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన భారతానికి చెందిన సహజ వాయువు నౌకలు సురక్షితంగా దేశానికి చేరుకోవడంతో, గృహ వినియోగ గ్యాస్ కొరత సమస్య త్వరలోనే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వరకు సరఫరా అంతరాయం కారణంగా ఎదురైన ఇబ్బందులు ఇక తగ్గనున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన శివాలిక్ అనే నౌక 46500 మెట్రిక్ టన్నుల LPGతో సోమవారం సాయంత్రం గుజరాత్ రాష్ట్రంలోని ముంద్ర పోర్టుకు చేరుకుంది. అదే సమయంలో నందాదేవి అనే మరో నౌక కూడా మంగళవారం జామ్‌నగర్ సమీపంలోని వాడినార్ పోర్టుకు విజయవంతంగా చేరుకోవడం కీలక పరిణామంగా మారింది. ఈ రెండు నౌకలు సురక్షితంగా దేశానికి చేరుకోవడం వల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థకు ఊపిరి లభించినట్లు భావిస్తున్నారు.
ఈ నౌకలను సురక్షితంగా దేశానికి తీసుకురావడంలో భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు. హార్ముజ్ జలసంధిని దాటే సమయంలో భారత, ఇరాన్ నౌకాదళాలు సమన్వయంతో సహాయం అందించాయని నందాదేవి నౌకకు చెందిన చీఫ్ అధికారి వెల్లడించారు. ఈ చర్యలు సమయానికి చేపట్టడం వల్లే ఈ నౌకలు ఎలాంటి ప్రమాదం లేకుండా దేశానికి చేరుకున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 22 భారత జెండా నౌకలు 611 మంది నావికులతో కొనసాగుతున్నాయని సమాచారం. ఇదే సమయంలో సుమారు 81000 టన్నుల ముర్బన్ ముడి చమురుతో యూఏఈ నుంచి బయలుదేరిన జగ్ లాడ్కి అనే మరో నౌక కూడా సురక్షితంగా భారతదేశానికి తిరిగి వస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలు దేశానికి ఇంధన భద్రత పరంగా సానుకూల సంకేతాలుగా భావిస్తున్నారు.
గుజరాత్‌లోని ముంద్ర, వాడినార్ పోర్టులకు చేరుకున్న ఈ రెండు నౌకల్లోని LPGLని ఇతర నౌకలకు బదిలీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యిన వెంటనే ఈ నౌకలను తమిళనాడుకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇతర మార్గాల ద్వారా రవాణా చేసే కంటే నేరుగా ఈ నౌకలను పంపించడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు సరఫరా త్వరగా పునరుద్ధరించబడుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.
మొత్తానికి ఈ పరిణామం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత సమస్యకు పెద్ద ఊరటగా మారే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా సరఫరా వ్యవస్థను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం, సంబంధిత విభాగాలు తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తుండటంతో ప్రజల్లో కొంత ఊరట కనిపిస్తోంది.
ALSO READ: చెన్నై సూపర్ కింగ్స్ వేడుకలో ‘పెద్ది’ సందడి
