Tuesday, March 3, 2026
Homeఆంధ్ర ప్రదేశ్టిడిపిలో భగ్గుమన్న విభేదాలు!

టిడిపిలో భగ్గుమన్న విభేదాలు!

  • ఎంపీ చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి

  • ఆలయంలో ప్రోటోకాల్ రగడ

క్రైమ్ మిర్రర్, విజయవాడ : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు సమీపిస్తోంది. జూన్ నాటికి రెండు సంవత్సరాల పాలన పూర్తవుతుంది. కూటమిపరంగా మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే ఉంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మాత్రం ఆ పార్టీల అధిష్టానాలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఎప్పుడు వివాదాస్పదంగానే మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో తిరువూరు నుంచి గెలిచారు కొలికపూడి శ్రీనివాసరావు. అయితే గెలిచిన నాటి నుంచి ఏదో ఒక వివాదంలో ఆయన చిక్కుకుంటూ వస్తున్నారు. సొంత పార్టీ శ్రేణులు సైతం ఆయన వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు పిలిచి మందలిస్తున్న ఆయన వైఖరి లో మార్పు రావడం లేదు. తాజాగా ఓ ఆలయ కార్యక్రమంలో.. ఆయన దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అనూహ్యంగా టిక్కెట్

అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కొలికపూడి శ్రీనివాసరావు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆ సమయంలో కొలికపూడి శ్రీనివాసరావు గట్టి వాయిస్ వినిపించారు. మీడియా డిబేట్లో పాల్గొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు. స్వతహాగా గ్రూప్ 1 శిక్షణలు ఇచ్చేవారు. హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ సంస్థలను సైతం నడిపేవారు. ఆ సంస్థల్లో శిక్షణ పొంది చాలామంది అధికారులు గా మారారు. అటువంటి కొలికపూడి అమరావతి విషయంలో గట్టిగా వాయిస్ వినిపించడమే కాదు.. చంద్రబాబు నాయకత్వం అవసరంపై నిత్యం మాట్లాడేవారు. అలా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి దగ్గరయ్యారు.

తరచూ వివాదాలు..

2024 ఎన్నికల్లో అనూహ్యంగా తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకున్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ఆ ఎన్నికల్లో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఓ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటిపై దండయాత్ర చేశారు. అటు తరువాత సొంత పార్టీ నేతలతో విభేదాలు ఏర్పడడంతో వారు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. అది మొదలు ఎన్నో రకాల వివాదాలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు పిలిచి మందలించడం.. తరువాత ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ కేసినేని చిన్నికి అప్పగించింది టిడిపి నాయకత్వం. అప్పటినుంచి వివాదాలు మరింత ముదిరాయి. ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని అన్నట్టు పరిస్థితి మారింది. తన అసెంబ్లీ టికెట్ కోసం కోట్లాది రూపాయలు తన వద్ద కేసినేని చిన్ని వసూలు చేసినట్లు ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హై కమాండ్ కొన్ని రకాల సూచనలు చేసింది. దీంతో వివాదం కొద్ది రోజులపాటు సద్దుమణిగింది.

పట్టు వస్త్రాల సమర్పణలో..

తాజాగా తిరువూరు నియోజకవర్గంలో జరిగిన ఓ ఆలయ వేడుకల్లో మరోసారి ఎమ్మెల్యే వెర్సెస్ ఎంపి అన్నట్టు పరిస్థితి మారింది. వేణుగోపాల స్వామి ఆలయంలో కల్యాణోత్సవాలకు ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సతీ సమేతంగా హాజరయ్యారు. అయితే అక్కడ పురోహితులు స్వామివారికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలను ఎంపీ చిన్నికి అందజేశారు. దీనిపై ప్రోటోకాల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను తీసుకున్నారు. దీంతో ఇద్దరి నేతల అనుచరుల మధ్య గట్టిగానే గొడవలు జరిగాయి. అక్కడ ఉన్న పోలీసులు సముదాయించడంతో సద్దుమణిగింది ఆ వివాదం. అయితే ఈ ఘటనతో టిడిపి హై కమాండ్ ఎమ్మెల్యే కొలికపూడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు కొలికపూడి సైతం అన్నింటికీ సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments