జస్ట్ వాకింగే కదా అనుకునేరు.. బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి 12 నిమిషాలు వాకింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వాకింగ్ ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాకింగ్ చేసే విధానం మారితే దాని ప్రభావం మరింత పెరుగుతుందన్న ఆసక్తికర విషయాన్ని తాజా పరిశోధన వెల్లడించింది.

వాకింగ్ ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాకింగ్ చేసే విధానం మారితే దాని ప్రభావం మరింత పెరుగుతుందన్న ఆసక్తికర విషయాన్ని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని ఐయోవా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, ఒంటరిగా నడకతో పోలిస్తే ప్రియమైన వ్యక్తి లేదా బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి కేవలం 12 నిమిషాలు వాకింగ్ చేసినా మెదడు పనితీరులో గణనీయమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని తేలింది. ఈ చిన్న అలవాటు మొత్తం ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై పెద్ద ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా చాలామంది జస్ట్ వాకింగ్ కదా అని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇదే వాకింగ్ మన జీవితాల్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచే కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా స్నేహితులతో కలిసి నడక చేయడం వల్ల శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా మంచి లాభాలు చేకూరుతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.

ఈ పరిశోధనలో భాగంగా కొంతమంది కాలేజీ విద్యార్థులను ఎంపిక చేసి, వారు తమకు అత్యంత ఇష్టమైన స్నేహితులతో కలిసి ఒక భవనం చుట్టూ 12 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని సూచించారు. ఇలా కొన్ని రోజుల పాటు వివిధ వాకింగ్ పద్ధతులను పాటింపజేసి, శరీరంలో ముఖ్యంగా మెదడులో చోటుచేసుకునే మార్పులను శాస్త్రీయంగా విశ్లేషించారు.

స్నేహితులతో కలిసి నడుస్తూ పరస్పరం మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, అనుభవాలు పంచుకోవడం వల్ల మెదడులోని మూడ్‌ను నియంత్రించే భాగాలు మరింత చురుకుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన స్థాయులు తగ్గి, ప్రశాంతత పెరుగుతోందని పరిశోధకులు వెల్లడించారు. సామాజిక అనుబంధాలు బలపడటంతో మానసిక స్థిరత్వం కూడా మెరుగవుతుందని చెప్పారు.

అంతేకాకుండా, వాకింగ్ సమయంలో జరిగే సహజమైన సంభాషణలు మెదడులో ఎమోషన్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రాంతాలను ఉత్తేజితం చేస్తున్నాయని అధ్యయనం తెలిపింది. శరీరాన్ని కదిలిస్తూ విశ్వసనీయంగా మాట్లాడటం వల్ల ఎమోషనల్ బాండింగ్ మరింత బలపడుతోందని, ఇది సానుభూతి, సంతోషం వంటి సానుకూల భావాలను పెంచుతోందని నిపుణులు వివరించారు.

ఈ ప్రక్రియలో ఒంటరితనం తగ్గి, స్నేహబంధాలు మరింత లోతుగా మారుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. రోజువారీ జీవితంలో పేరుకుపోయే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మందులు అవసరం లేకుండా, స్నేహితులతో చేసే చిన్న నడక చాలనేది ఈ అధ్యయన సారాంశం. ఇలాంటి వాకింగ్ అలవాటు దీర్ఘకాలంలో డిప్రెషన్, ఆందోళన సమస్యలను దూరం చేయడంలో కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజులో కేవలం 12 నిమిషాలు స్నేహితులతో కలిసి నడవడం వల్ల మానసికంగా ఉల్లాసంగా, శారీరకంగా చురుకుగా ఉండవచ్చని సూచిస్తున్నారు.

అందుకే వీలైతే రోజువారీ జీవనంలో ఒంటరిగా కాకుండా స్నేహితులు, ప్రియమైన వారితో కలిసి వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న మార్పు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి బలమైన పునాదిగా మారుతుందని అంటున్నారు.

ALSO READ: Bhatti Vikramarka: మున్సిపల్ అభ్యర్థులపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button