ప్రేమ, కోపం, అలక, పశ్చాత్తాపం… ఇవన్నీ మనుషులకే పరిమితం అనుకుంటే అది పెద్ద పొరపాటే. జంతువులకూ మనలాంటి భావోద్వేగాలు ఉంటాయని మరోసారి నిరూపించే ఒక ఆసక్తికర ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక గొరిల్లా ప్రవర్తన చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా మనుషుల మధ్య చిన్నపాటి గొడవలు, అలకలు సహజమే. ముఖ్యంగా సన్నిహిత సంబంధాల్లో ఒకసారి కోపం వచ్చాక కొంతసేపటికి ఆలోచనలో మునిగిపోవడం, తాము చేసిన తప్పును తలుచుకోవడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ఒక గొరిల్లాలో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
జపాన్‌లోని నాగోయా నగరంలో ఉన్న హిగాషియామా జూ అండ్ బొటానికల్ గార్డెన్‌లో నివసిస్తున్న “కియోమాసా” అనే గొరిల్లా ఈ వీడియోలో కనిపిస్తుంది. దాని వయసు సుమారు 13 సంవత్సరాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సిల్వర్‌బ్యాక్ గొరిల్లా “షబానీ” కుమారుడే ఈ కియోమాసా కావడం ప్రత్యేకత.
ఇటీవల తన జంటతో చిన్నపాటి గొడవ జరిగిన తర్వాత కియోమాసా ఒంటరిగా కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది. వీడియోలో అది కుడి చేతిని శరీరానికి అడ్డంగా పెట్టుకుని, ఎడమ చేతిని నోటిపై ఉంచుకుని గంభీరంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ హావభావాలు చూసినవారికి అది ఒక మనిషి లోతుగా ఆలోచిస్తున్నట్లే అనిపిస్తుంది.
ఈ దృశ్యాలను జూ సందర్శకులు తమ కెమెరాల్లో బంధించడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు “ఇది చూస్తుంటే మా ఇంట్లో జరిగే సీన్‌లానే ఉంది” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి జంతువులలో కూడా భావోద్వేగాలు ఎంత లోతుగా ఉంటాయో గుర్తు చేస్తోంది. మనుషులతో పోలిస్తే మాటలతో చెప్పలేకపోయినా, వాటి ప్రవర్తన ద్వారా తమ భావాలను వ్యక్తం చేయగలవని ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోంది.