
మనుషులకే ప్రేమాభిమానాలు, ఆప్యాయతల వ్యక్తీకరణ ఉంటుందనుకోవడం ఒక అపోహ మాత్రమే. జంతు ప్రపంచంలోనూ భావోద్వేగాలు, అనుబంధాలు, సాన్నిహిత్యాన్ని వ్యక్తపరచే విధానాలు విస్తారంగా కనిపిస్తాయి. తాజా పరిశోధనలు, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కొన్ని జంతువులు మనుషుల మాదిరిగానే ముద్దులు పెట్టుకోవడం ద్వారా తమ ప్రేమను, సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఒరంగుటాన్లు, చింపాంజీలు, బోనోబోస్ అనే అత్యంత తెలివైన కోతి జాతులు తమ భావాలను వ్యక్తపరచేందుకు ముద్దులు పెట్టుకుంటాయి. ముఖ్యంగా బోనోబోస్ జాతి కోతులు సామాజిక సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో ముద్దు అనేది కేవలం ప్రేమకే కాదు.. పరస్పర నమ్మకం, బంధాన్ని బలోపేతం చేసే సంకేతంగా కూడా పనిచేస్తుంది.
సముద్ర జీవులైన డాల్ఫిన్లు కూడా తమ గుంపులోని సభ్యులతో సాన్నిహిత్యాన్ని చూపించేందుకు ఒకరినొకరు నోటితో తాకడం, ముఖాన్ని దగ్గర పెట్టడం వంటి ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఇది ముద్దు లాంటిదే అనిపించినా.. వారి మధ్య ఉన్న సామాజిక అనుబంధాన్ని తెలియజేసే విధానం అని నిపుణులు వివరిస్తున్నారు.
భూభాగంపై జీవించే ఉడతలు కూడా తమ భాగస్వామి పట్ల ప్రేమను చూపించేందుకు ముఖాలను దగ్గర పెట్టి తాకించుకోవడం, నోటి భాగాన్ని తాకేలా ప్రవర్తించడం చేస్తాయి. ఇదే విధంగా ఫ్లెమింగోలు, పఫిన్లు వంటి పక్షులు కూడా ఒకరినొకరు ముక్కుతో తాకించుకుంటూ, సాన్నిహిత్యాన్ని వ్యక్తపరుస్తాయి. ముఖ్యంగా జత కట్టే సమయంలో లేదా పిల్లలను పెంచే దశలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే, జంతువులలో కనిపించే ఈ ప్రవర్తనను మనుషుల ముద్దులతో పూర్తిగా పోల్చలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కొన్ని జంతువులు ముద్దు పెట్టుకున్నట్లుగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి ఎదుటి జీవి వాసనను గుర్తించడానికి, తమ భాగస్వామి సరైనదేనా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి అలా ప్రవర్తిస్తాయి. వాసన ద్వారా సమాచారాన్ని సేకరించడం అనేది జంతు ప్రపంచంలో అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ విధానం.
ప్రేమ, సాన్నిహిత్యం, అనుబంధం అనే భావాలు మనుషులకే పరిమితం కావని, ప్రకృతిలోని ప్రతి జీవిలో అవి ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతాయనే విషయాన్ని ఈ అధ్యయనాలు మరోసారి నిరూపిస్తున్నాయి. జంతు ప్రపంచాన్ని లోతుగా గమనిస్తే, మనిషి భావోద్వేగాలకు సమాంతరంగా ఉన్న అనేక ఆసక్తికర అంశాలు అక్కడ కనిపిస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: ఆడవాళ్ల రక్తం రుచి మరిగిన పోలీస్.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్





