
Pak Army Chief Asim Munir: పాకిస్తాన్ మరోసారి దుష్ట బుద్దిని బయటపెట్టుకుంది. భారత్ పై అణుదాడికి దిగుతామని ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించాడు. పాకిస్థాన్ కు ముప్పు వాటిల్లితే.. సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్తామంటూ పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. అమెరికాలో ఓ కార్యక్రంలో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత ప్రవాస పాకిస్థానీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా గడ్డ పైనుంచి ఒక దేశానికి అణు బెదిరింపులు చేశాడు.
సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం!
ఇక భారత్ సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునీర్ తీవ్రంగా స్పందించాడు. సింధూనది భారతీయుల ఆస్తి కాదన్న ఆయన, భారత ప్రభుత్వం సింధూ జలాలను ఆపడం వల్ల 25 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నాడు. భారత్ సింధూ నది మీద ఆనకట్టలు నిర్మిస్తే తాము క్షిపణులతో పేల్చేస్తామన్నాడు. పాకిస్థాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే.. భారత్‌పై అణుబాంబులు వేసేందుకు వెనకాడబోమన్నాడు. తాము మునిగిపోతూ.. సగం ప్రపంచాన్ని తమతో తీసుకెళ్తామంటూ తమలోని విద్వేషాన్ని వెల్లగక్కాడు.
భారత్ బెంజ్.. పాక్ డంప్ ట్రక్!
ఇక తమతో యుద్ధంలో భారత్ ఎంతో నష్టపోయిందని మునీర్ అవాకులూ చవాకులు పేలాడు. స్పోర్ట్స్ మన్ స్పిరిట్ తో భారత్ తనకు జరిగిన నష్టాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశాడు. భారత్‌ను అధునాతన మెర్సిడెస్ గా పేర్కొంటూ.. ఫెరారీలా హైవేపై దూసుకెళ్తోందన్నారు. అదే సమయంలో.. పాకిస్థాన్‌ను డంప్ ట్రక్కుగా పేర్కొంటూ.. రెండూ ఢీకొంటే నష్టం ఎవరికో గుర్తించాలన్నాడు. ఈ పోలిక మాత్రం మునీర్ చక్కగా చేశాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలతో, ఆ దేశం ఎప్పటికీ డంప్ ట్రక్కుగానే ఉంటుందని ఎద్దేవా చేస్తున్నారు.
Read Also: భారత్ దాదాగిరిని సహించదు, అమెరికాపై నితిన్ గడ్కరీ ఆగ్రహం!