
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): నాగలి పట్టి లోకానికి అన్నం పెట్టే అన్నదాతకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఒక భూతంలా తయారైంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పులు చేసి పంట పండించే రైతుకు, చివరకు యూరియా కూడా అందని ద్రాక్షలా మారింది. మర్రిగూడ మండలంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న యూరియా బుకింగ్ రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
—ఫ్లాష్ సేల్‌ను తలపిస్తున్న బుకింగ్స్ : సాధారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌లో మొబైల్ ఫోన్లు సెకన్లలో అమ్ముడైనట్లుగా, మర్రిగూడలో యూరియా బుకింగ్స్ కేవలం 4 నిమిషాల్లోనే ముగిసిపోయాయి. ఉదయం 9 గంటలకు పోర్టల్ ఓపెన్ కాగానే, వందల సంఖ్యలో రైతులు బుకింగ్ కోసం ప్రయత్నించారు. కానీ, అప్పటికే స్టాక్ మొత్తం సున్నా అని చూపించడంతో రైతులు విస్మయానికి గురయ్యారు.
యాప్ ల ద్వారా బుకింగ్ చేసుకోవడంపై, అవగాహన ఉన్న కొందరు యువ రైతులు ఎలాగోలా నెట్టుకొస్తున్నప్పటికీ, వయసు మళ్లిన, సాంకేతిక పరిజ్ఞానం లేని సామాన్య రైతులు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు మంచినీటి నల్లా కోసం బిందెలతో ఎదురు చూసిన పరిస్థితి పోయి, ఇప్పుడు యూరియా బస్తా కోసం స్మార్ట్ ఫోన్ పట్టుకుని గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది అధికారుల ప్రణాళికా లోపమా లేక రైతులకు రాసిపెట్టిన శాపమా అంటూ, స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం..రైతేడ్చిన రాజ్యం బాగుపడదు.. అన్న నానుడిని గుర్తుచేస్తూ, రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్లైన్ బుకింగ్ విధానంలోని లోపాలను సరిదిద్ది, క్షేత్రస్థాయిలో రైతులకు నేరుగా యూరియా అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు..





